Monday, April 29, 2024

Delhi | అమిత్ షా జేబుల్లో బాబు, జగన్.. బీజేపీ ఆక్సిజ‌న్‌తోనే జగన్ సర్కారు జీవం: చింతా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెరో జేబులో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆరోపించారు. బీజేపీ ఇచ్చే ప్రాణవాయువుతోనే ఏపీలో జగన్ సర్కారు నడుస్తోందని, ప్రాణవాయువు తగ్గిన ప్రతిసారీ జగన్ ఢిల్లీ పర్యటన చేపడుతుంటారని ఆయన అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడును తొందరబాబు నాయుడుగా అభివర్ణించిన చింతా మోహన్, తాజాగా అమిత్ షాను కలవడంతో చంద్రబాబుకు ఉన్న ఓటుబ్యాంకులో 15-20 శాతం కోల్పోయారని సూత్రీకరించారు.

తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో సాధించినవి ఏవైనా ఉన్నాయంటే అవి ఆకలి, దరిద్రం, నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు. మొన్నటి ఒడిశా రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా చనిపోయారని, చనిపోయినవారంతా పొట్టకూటి కోసం వలసపోతున్న కూలీలేనని ఆయనన్నారు. రాత్రికి రాత్రే వందల శవాలను బాలాసోర్ అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ జనాభాలో 100 కోట్లకు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోటీశ్వరుల కోసమే బీజేపీ సర్కారు పనిచేస్తోందని, అదానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ. 12 లక్షలు కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. యూపీఏ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసే బీజేపీ నేతలకు ఇది అవినీతిలా కనిపించడం లేదా అన్నారు.

- Advertisement -

ఏపీలో జగన్ సర్కారు నాలుగేళ్లలో సాధించింది ఏంటి అంటే హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్ లు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ కోశానా అభివృద్ధి లేదని, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు చేయాల్సిన పనులు సీఎం జగన్ చేస్తున్నారని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20-30కి మించి సీట్లు రావని చింతా మోహన్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇటు జగన్మోహన్ రెడ్డికి, అటు చంద్రబాబు నాయుడుకు ఓటేసే పరిస్థితి లేదని వెల్లడించారు. ఈ వర్గాల ప్రజలు కొత్త ముఖం కోసం ఎదురుచూస్తున్నారని, సరిగ్గా ఈ దశలో వచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వారి దృష్టి కాంగ్రెస్ మీద పడిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు కాపులకు, మరో రెండున్నరేళ్లు ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చింతా మోహన్ ప్రకటించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, తాను కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించగలను అని ఆయన వ్యాఖ్యానించారు. కాపులు అధికారం కోరుకుంటున్నారని, ఇన్నాళ్లూ కేవలం రెండు వర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవించాయని, వారిలో కొందరు విపరీతంగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారన్న ప్రశ్నకు.. ఆయన గురించి తాను మాట్లాడనని చింతా మోహన్ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement