Friday, May 3, 2024

చైనా – భారత్ చమురు పోరు.. రష్యానుంచి కొనుగోలుకు పోటాపోటీ

ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యానుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్‌ చురుకుగా వ్యవహరిస్తోంది. తమకు అవసరమైన ముడి చమురును పెద్దఎత్తున కొనుగోలు చేస్తోంది. అయితే, భారత్‌ దూకుడు చైనాకు తలనొప్పిగా తయారైంది. రష్యానుంచి చైనా కొనుగోలు చేయడానికి ఇష్టపడే గ్రేడ్‌ (రకం) ముడి చమురునే భారత్‌ పెద్దఎత్తున కొనుగోలు చేస్తూండటం విశేషం. రష్యానుంచి ఎక్కువగా ఐరోపా దేశాలు ప్రత్యేక రగం ముడి చమురును కొనుగోలు చేస్తాయి. ఆ ముడి చమురును శుద్ధి చేయాలంటే ప్రత్యేక యంత్రసామాగ్రి, పెద్దఎత్తున ఆధునిక సాంకేతికత అవసరం. అలాగే, చైనా కొనుగోలు చేసే ముడి చమురు శుద్ధి చేయాలన్నా ప్రయాసే. ఆ ఏర్పాట్లున్నందునే ఆయా దేశాలు రష్యా నుంచి తమకు నచ్చిన గ్రేడ్‌ల ముడి చమురును కొనుగోలు చేసేవి. ఈ నేపథ్యంలో సాధారణ రకం ముడి చమురును కొనుగోలు చేసే భారత్‌ ఇప్పుడు చైనా కొనే గ్రేడ్‌ (ఈఎస్‌పీఓ) చమురునే అడుగుతోంది. రష్యాలోనూ తూర్పు భాగాన ఉన్న రిఫైరీలనుంచి పెద్దఎత్తున క్రూడ్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. తాజాగా ఈఎస్‌పీఓ ముడి చమురుతో కూడిన నాలుగు ప్రత్యేక నౌకలు భారత్‌లోని పారాదీప్‌ నౌకాశ్రయానికి బయలుదేరి వస్తున్నాయి. అక్కడే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని నూనెశుద్ధి కర్మాగారంలో శుద్ధి చేశాక దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఏప్రిల్‌లో ఒక నౌకలోను, జూన్‌లో 3 నౌకల్లోనూ ముడి చమురును దిగుమతి చేసుకున్న భారత్‌ జులైలో ఏకంగా 4 నౌకల్లో దిగుమతి చేసుకుంటూండం గమనార్హం. రష్యానుంచి ముడి చమురు కొనుగోలును అమెరికా సహా పలు ఐరోపా దేశాలు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై క్రెవ్లిున్‌ దండయాత్ర నేపథ్యంలో ఆంక్షలు విధించడంవల్ల, వాటిని నిర్వీర్యం చేసేలే భారత్‌ వ్యవహరించకూడదని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ సూచించినా దేశ ప్రయోజనాల రీత్యా ముడి చమురు కొనుగోళ్లు ఆపేది లేదని, అయినా ఐరోపా దేశాలు దిగుమతి చేసుకునే మొత్తంతో పోలిస్తే భారత్‌ చాలా స్వల్పస్థాయిలోనే దిగుమతి చేసుకుంటోందని కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అటు ఐరోపా దేశాలు రష్యానుంచి ముడి చమురును కొనుగోలు చేయకపోవడంతో రష్యా కూడా భారత్‌ మార్కెట్‌పై కన్నేసింది. కారుచౌకగా ముడి చమురు సరఫరాకు అంగీకరించింది.

ఆ చమురు చౌక..

రష్యా తూర్పు తీరంలో లభ్యమయ్యే ఈఎస్‌పీఓ ముడి చమురు కారుచౌక. అయితే దూరాభారం కావడం వల్ల ఏ దేశమూ పెద్దగా ఆసక్తి చూపదు. పైగా ఆ చమురును తరలించేందుకు ఉపయోగించే వెస్సల్స్‌ చిన్నవిగా ఉంటాయి. పెద్దఎత్తున కొనుగోలు చేస్తే రవాణాకు అధిక సమయం పడుతుంది. అయినప్పటికీ పర్షియన్‌ గల్ఫ్‌, పశ్చిమ ఆఫ్రికా దేశాలు సరఫరా చేసే ముడి చమురు ధరలకన్నా ఇది చౌక కావడం వల్ల ఇప్పుడిప్పుడే ఇతర దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా భారత్‌నుంచి చైనాకు గట్టి ఫోటీ ఎదురవుతోంది. రష్యా తూర్పు తీరం నుంచి చైనాకు రవాణా సౌలభ్యం ఉండడం వల్ల ఇన్నాళ్లూ చైనాయే ప్రధాన మార్కెట్‌గా ముడి చమురు కొనుగోళ్లు సాగేవి. వారంలో ఐదు రోజులు చైనాకు ఈఎస్‌పీఓ గ్రేడ్‌ ముడి చమురుతో కూడిన నౌకలు ప్రయాణిస్తూనే ఉంటాయి. బ్రెజిల్‌, పశ్ఛిమ ఆఫ్రికా దేశాలనుంచి వచ్చే ముడి చమురుకన్నా రష్యా చమురును శుద్ధి చేయడంలో చైనా చమురు శుద్ధి కేంద్రాలు నిరంతరం బిజీగా ఉంటాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement