Monday, May 6, 2024

ఈవీలకు 72 బిలియన్‌ డాలర్ల ప్రోత్సహకాలు.. పన్నుల్లో రాయితీలు ప్రకటించిన చైనా

ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. చాలా దేశాల్లో వీటిని ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే ఈవీ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం 72 బిలియన్‌ డాలర్ల మేర పన్నుల్లో రాయితీలు ప్రకటించింది. మన దేశంలోనూ విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నాయి. టూ వీలర్స్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌2 పేరుతో సబ్సిడీ ఇస్తోంది.

చైనా ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలు, గ్రీన్‌ కార్ల అమ్మకాలను గణనీయంగా పెంచేందుకు భారీగా పన్నుల్లో రాయితీలు ప్రకటించింది. ఆర్ధిక పరిస్థితులు మూలంగా వీటి అమ్మకాలు తగ్గడంతో కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూ ఎనర్జీ వెహికల్స్‌ (ఎన్‌ఈవీ) విక్రయించే ప్రతివాహనంపై 30వేల యాన్స్‌ వరకు కొనుగోలు పన్నుల్లో రాయితీ ఇవ్వనున్నారు. ప్రధానంగా 2024,2025 సంవత్సరాల్లో విక్రయించే వాహనాలపై ఈ రాయితీ లభిస్తుంది. 2026, 27 సంవత్సరాల్లో ఇది సగానికి తగ్గించనున్నట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. మొత్తం పన్నుల్లో రాయితీల విలువ 72 బిలియన్‌ డాలర్లు (520 బిలియన్‌ యాన్స్‌) ఉంటుందని ఆర్ధిక శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న విధానానికి ఇది కొనసాగింపు అని చైనా ఆర్ధిక శాఖ తెలిపింది. 2023 చివరి వరకు ప్ర్‌స్తుత విధానం కొనసాగుతుందని తెలిపింది. ప్ర్‌స్తుతం పూర్తిగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలు, ప్లగ్‌ ఇన్‌ పెట్రోల్‌-ఎలక్ట్రిక్‌ హైబ్రీడ్‌ వాహనాలు, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ వాహనాలకు పూర్తిస్థాయిలో కొనుగోలు పన్ను రాయితీ లభిస్తుంది. ఈ స్కీమ్‌ను పొడిగించిన ప్ర్‌భుత్వం వచ్చే 4 సంవత్సరాల్లో కొనుగోలు పన్నులో రాయితీలు ప్రకటించింది.

- Advertisement -

మొదటి రెండు సంవత్సరాలు 30వేల యాన్ల వరకు, తరువాత రెండు సంవత్సరాల్లో ఇందులో సగం వరకు రాయితీలు ఇవ్వనున్నారు. చైనా కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. చైనాలో లీ ఆటో, నీయో ఆటో, బీవైడీ ప్రధానంగా విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. బీవైడీ విద్యుత్‌ కార్లు, ట్రక్కులు, బస్సులను తయారు చేస్తోంది. బీవైడీ కంపెనీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ కార్లను విక్రయిస్తోంది. అమ్మకం పన్నుల్లో రాయితీల మూలంగా వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement