Saturday, May 18, 2024

మంత్రుల ఇలాకాలో చంద్రబాబు పర్యటన.. 6 7, 8 తేదీల్లో టూర్ ఖరారు

తిరుపతి,ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ): ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడురోజుల పర్యటన ఖరారైంది. ఆ పర్యటనలో భాగంగా 6వ తేదిన మదనపల్లెలో మినీ మహానాడులో పాల్గొంటారు. 7న పీలేరులో అన్నమయ్య జిల్లా స్దాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. 8న గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో రోడ్‌ షో ద్వారా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. గత మే నెలాఖరులో ఒంగోలులో జరిగిన మహానాడుకు ముందుగా నియోజకవర్గాల పరిధుల్లో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలని పార్టీవర్గాలకు దిశానిర్దేశం చేసింది. అందుకుదీటుగా ఈ నెల 8వ తేదిన గుంటూరులో నిర్వహించతలపెట్టిన పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల సన్నద్ద కార్యక్రమాల్లో భాగంగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల స్దాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించి పార్టీవర్గాలలో ఉత్సాహాన్ని నింపింది. అదేవిధంగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి పోటీగా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతుండగా, పెద్దిరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో గట్టిపోటీ ఇచ్చేందుకు చల్లారామచంద్రారెడ్డి అభ్యర్ధిత్వాన్ని చంద్రబాబు ముందస్తుగానే ప్రకటించారు. తాజాగా చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి, శాసనమండలి సభ్యుడు భరత్‌ అభ్యర్దిత్వాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరులో పార్టీ ప్లీనరీ సదస్సులో ఖరారు చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమ వుతున్న నేపథ్యంలో ఈ నెల 6,7,8 తేదీలలో నిర్వహించతలపెట్టిన చంద్రబాబు పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుం టోంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కి తన నియోజక వర్గం పుంగనూరు తర్వాత వర్గబలం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మదనపల్లె, పీలేరు కావడం చెప్పుకోదగిన విశేషం. అదేవిధంగా రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలు కూడా కావడం గమనార్హం. అయితే మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఎ క్కువగా ఉన్నా స్దానిక నాయకుల్లో అనైక్యత కారణంగా ఆ పార్టీ పలురకాల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో మదనపల్లె, పీలేరుల్లో జరిపే పర్యటనలో చంద్రబాబు పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ముందస్తుగా అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ముగ్గురు రాష్ట్ర మంత్రులకు చెందిన మదనపల్లె, పీలేరు, గంగాధరనెల్లూరు ,నగరి ప్రాంతాల్లో తాజాగా నిర్వహించే పర్యట నలో చంద్రబాబు పార్టీవర్గాల్లో ఉత్సాహం నింపడంతో పాటు రాను న్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులెవరో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తగినట్టే ఈ నియోజకవర్గాల్లో మండలస్దాయి నాయకులను పార్టీలో చేర్పించడానికి కూడా స్దానిక నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏదిఏమైనా వచ్చే ఏడాదే ముందస్తుగా ఎన్నికల లో వస్తాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ముగ్గురు మం త్రులకు చెందిన ఇలాకాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న తాజా పర్యటన పలురాజకీయ సమీకరణలకు దోహదపడుతుందని స్పష్టమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement