Saturday, May 4, 2024

Delhi | జాప్యానికి సవాలక్ష కారణాలు.. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆలస్యంపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-1 ప్రారంభించడంలో జాప్యానికి ఇసుక లభ్యత లేకపోవడం కూడా ఓ కారణమని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా సల్ఫర్, నైట్రోజన్ వంటి ఉద్గారాల విషయంలో కొత్త పర్యావరణ నిబంధనల మేరకు బాయిలర్‌ను రీ-ఇంజనీరింగ్ చేయడం వల్ల జాప్యం జరిగిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు, పరిమితులు, ఇతర నియంత్రణల కారణంగా ఇసుక లభ్యత లేదని, అది కూడా జాప్యానికి కారణమైందని వెల్లడించారు.

కోవిడ్-19 మహమ్మారి ఆంక్షలు, లాక్‌డౌన్ ప్రభావం కూడా మరొక కారణమని చెప్పారు. పర్యావరణ అనుమతుల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన సరికొత్త నిబంధనలు, షరతుల కారణంగా కూడా జాప్యం జరుగుతోందని తెలిపారు. అలాగే కమిషనింగ్ సమయంలో బీహెచ్ఈఎల్ పనులు నెమ్మదిగా సాగడం, షాప్ వెల్డ్ జాయింట్స్‌లో తయారీ లోపాలను గుర్తించడం వల్ల కూడా జాప్యం నెలకొందని వివరించారు. ప్రస్తుత అంచనాల మేరకు యూనిట్-1ను 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మంజూరు చేసిన మొత్తంలో ఇప్పటివరకు రూ. 10,997.70 కోట్లు ఖర్చయిందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement