Monday, April 29, 2024

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి పైన కక్ష్య కట్టింది : మంత్రి ఎర్రబెల్లి

దుగ్గొండి : ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రికి “ఉత్తర యుద్ధం” ద్వారా ఉత్తరాలు పంపే కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో నేడు దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న‌ద‌న్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు విత్తనాలను సకాలంలో సరఫరా చేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే.. మోడీ సర్కార్ రైతుల పైన అనేక ఆంక్షలు విధిస్తూ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే ధాన్యం కొనుగోలు చేయకూడదన్నారు. ఎరువులు విత్తనాల రేట్లు పెంచుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర సర్కార్ వ్యవసాయంపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్న‌ద‌న్నారు. తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం సాయం చేయకపోగా, ఎట్లాగైనా దొడ్డి దారిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుయుక్తులు పన్నుతుంద‌న్నారు. ఈ ప్రాంతానికి కేంద్రం ద్వారా రావాల్సిన నిధులు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రభుత్వ సంస్థలన్నిటిని అమ్మేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీస్తున్న మోడీకి రైతులు త్వరలోనే బుద్ధి చెబుతార‌న్నారు. అనంత‌రం ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టద్దు, పంట స్థాయిని బట్టి ఎకరానికి కూలీ టోకెన్లు, మస్టర్ లో 100 పని దినాలు ఉండే విధంగా చూడాల‌న్నారు.

వ్యవసాయ కూలికి రోజుకు 257/- ఇవ్వాలని చట్టం ఉన్నప్పుటికీ ఏ ఒక్క కూలికి 100/- లకు మించడం లేదు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గం.లు పని చేసిన కూలికి 480/- ఇవ్వాలని ఉన్నప్పటికి ఉపాది హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ అందటం లేదు. స‌న్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతలతో కూలీలుగా వారే ఉంటున్నారు, కాబట్టి వ్యవసాయాన్ని అనుసందానం చేయటం వల్ల రైతులకు, కూలీలకు గిట్టుబాటు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయనికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలనే అసెంబ్లీ తీర్మాణాన్ని అమలు చేయాల‌న్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో సంబంధింత మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు & రైతులను కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేసి కేంద్ర ప్రభుత్వానికి పోస్టల్ కార్డుల ద్వారా సందేశాన్ని పంపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రూ.4.కోట్ల 41 లక్షలతో వెంకటాపురం నుండి మహ్మదాపురం మీదుగా నర్సంపేట మండలం రాజేశ్వరావుపల్లి గ్రామం వరకు నూతన బిటి రోడ్డు పనులకు మంత్రితో & స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింద‌న్నారు. దానితో పాటు రూ. కోటి.20 లక్షలతో మహ్మదాపురం గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్, ఎంపిపి, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ఎంపిటిసి, సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement