Monday, April 29, 2024

5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్రం అనుమతి.. 20 సంవత్సరాల కాలానికి వేలం

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు ఆమోదం తెలిపింది. జులై చివరి నాటికి 72,097.85 మెగా హెడ్జ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తారు. దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్‌ విభాగం చేసిన ప్రతిపాదనను మంత్రి వర్గం ఆమోదించింది. స్పెక్ట్రమ్‌ను 20 సంవత్సరాల కాల వ్యవధి కోసం వేలం వేస్తారు. ఇందులో 600 ఎంహెచ్‌జడ్‌, 700 ఎంహెచ్‌జడ్‌ 800 ఎంహెచ్‌జడ్‌, 900 ఎంహెచ్‌జడ్‌, 1800 ఎంహెచ్‌జడ్‌, 2100 ఎంహెచ్‌జడ్‌, 2300 ఎంహెచ్‌జడ్‌, మధ్యస్థాయిలో 3300 ఎంహెచ్‌జడ్‌, అత్యధిక స్థాయిలో 26 గిగాహెడ్జ్‌ల ఫ్రీక్వెన్సీ బాండ్ల స్పక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు.

ప్రయివేట్‌ క్యాపిటివ్‌ నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వేలం లో కనీస ధర ఎంత ఉంటుందన్న విషయాన్ని వెల్లడించలేదు. టెలికం కంపెనీలు మాత్రం బేస్‌ ధరలో 90 శాతం తగ్గించాలని పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేశాయి. ట్రాయ్‌ మాత్రం 2008 ధరల స్థాయిలో ఉండేలా 39 శాతం తగ్గించాలని సూచించింది. గత నెలలోనే డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ 5జీ వేవ్‌లను వేలం వేసేందుకు ఆమోదం తెలిపింది.

వేలం సొమ్మును చెల్లించేందుకు ఈ సారి వెసులుబాటు కల్పించారు. వెెలంలో ఈ సారి ముందుగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. సొమ్మును 20 సంవత్సరాల్లో సమాన వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. వాయిదా సొమ్మును ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నగదు లభ్యత విషయంలో టెలికం కంపెనీలకు మంచి వెసులుబాటు కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

10 సంవత్సరాల తరువాత స్పెక్ట్రమ్‌ను వెనక్కి ఇచ్చే అవకాశం బిడ్డర్లకు కల్పించారు. ఇలా సరెండర్‌ చేసిన తరువాత చెల్లించాల్సిన మిగిలి వాయిదాల నుంచి మిన్హయింపు ఇచ్చారు. గతంలో ఉన్న బ్యాంక్‌ గ్యారంటీని కూడా సారి ఎత్తి వేశారు. 5జీ సేవలు అందించేందుకు, డిమాండ్‌కు అనుగుణంగా తగినంత బ్యాక్‌హాల్‌ స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉంచాల్సి ఉంది. 5జీ స్పెక్ట్రమ్‌ పై ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలు అధికంగా ఉన్నాయని టెలికమ్‌ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. స్పెక్ట్రమ్‌ వేలం ఎంత అన్న విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. 5జీ స్పెక్ట్రమ్‌ను తమకు కొంత రిజర్వ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని , టెలికమ్‌ శాఖను ఇటీవలనే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ల్‌ కోరింది.

ఒక యూనిట్‌ కు బేస్‌ ప్రైస్‌ 317 కోట్లు ఉండాలని ట్రామ్‌ సిఫారసు చేసింది. ఇది 2018 నాటికి ధరకు సమానం. టెలికమ్‌ సంస్థలు ప్రధానంగా రిలయన్స్‌ జియో, ఎయిర్‌ టెల్‌ మాత్రం ప్రభుత్వం ప్రకటించిన బేస్‌ ప్రైస్‌లో 90 శాతం తగ్గించాలని కోరాయి.
5జీ సేవలు అందుబాటులోకి వస్తే 4జీలో వస్తున్న డౌన్‌లోడ్‌ స్పీడ్‌ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -

5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు కోసం టెలికం కంపెనీలు లక్ష నుంచి లక్షా 10 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని టెలికం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేలంలో స్పెక్ట్రమ ను దక్కించకున్న సంస్థలు సంవత్సరానికి కనీసం 17 వేల కోట్లు చెల్లించాల్సివుంటుంది. 5జీ వల్ల టెలికం కంపెనీల చందాదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఒక నియోగాదారుడి నుంచి 2023 నాటికి నెలకు 170 రూపాయల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement