Monday, April 29, 2024

బ్యాంకుల ప్రైవేటీకరణపై వేగం పెంచిన కేంద్రం..

ఆర్థికలోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నది. గతంలో ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీలను అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి నష్టాలు తెచ్చిపెడుతున్న ఎయిర్‌ ఇండియాను టాటాలకు అమ్మేసిన కేంద్రం.. అదే దూకుడు కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం ఇప్పటికే అనుకున్నట్టుగా విజయవంతంగా ఎల్‌ఐసీ ఐపీఓ మార్కెట్లోకి తీసుకొచ్చి డబ్బును సమీకరించుకుంది. దీనికితోడు ఇంధన వ్యాపారంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌లో వాటాలను అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వీటికితోడు బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తున్నది.

కానీ సదరు బ్యాంకుల ఉద్యోగులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి అడ్డంకుల వల్లే ప్రైవేటీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ప్రైవేటీకరణకు అవసరమైన శాసన ప్రక్రియ పూర్తయ్యాక పెట్టుబడుల ఉప సంహరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలోనూ ప్రస్తావించారు. రెండు బ్యాంకులతో పాటు ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీని సైతం ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. కేంద్రం పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులు ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. నీతి ఆయోగ్‌ ఇప్పటికే ప్రైవేటీకరించాల్సిన బ్యాంకులను గుర్తించినట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement