Tuesday, April 30, 2024

ఆధార్‌పై మూడీస్‌ ఆరోపణలు – ఖండించిన కేంద్రం

న్యూఢిల్లి : మన దేశంలో పౌరుల గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్‌పై ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా ఆధార్‌ ఉపయోగించడం విశ్వసనీయం కాదని తెలిపింది. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమని స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్‌ ఐడీ ప్రొగ్రామ్‌ ఆధార్‌ అని మూడీస్‌ పేర్కొంది. దీనిపై సంస్థ డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డిజిటల్‌ అసెట్స్‌ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఆధార్‌ వినియోగం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశము ఉందని ఈ నివేదికలో పేర్కొంది. అట్టడుగు వర్గాలను ఏకీకృతం చేయడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను చిట్టచవరి వ్యక్తికి విస్తరించడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఏడీఏఐ) ఆ ఆధార్‌ను తీసుకు వచ్చింది. చాలా పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. దీని వల్ల తరచుగా సేవల తిరష్కరణ వంటివి జరుగుతున్నాయి. బయోమెట్రిక్‌ సరిగా రాక చాలా మందికి సేవలు అందడంలేదు. ముఖ్యంగా అత్యంత వేడి, తేమ వాతావరణంలో పని చేసే కార్మికులు ఆధార్‌ను వినియోగించడం అంత విశ్వసనీయమైనది కాదని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయడాన్ని ప్రస్తావిస్తూ మూడీస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

పౌరుల సున్నితమైన సమాచారం కలిగి ఉన్న ఆధార్‌ వల్ల డేటా ఉల్లంఘనల ముప్పు పొంచి ఉందని మూడీస్‌ ఆరోపించింది. కేంద్రీకృత వ్యవస్థలో బ్యాంకింగ్‌ అవసరాలు, సామాజిక మాధ్యమాలు, ప్ర్‌భుత్వ సంక్షేమ పథకాలు ఇలా అన్నింటికి ఒకే గుర్తింపు కార్డును వినియోగిస్తున్నారు. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉందని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది.

కేంద్రం వివరణ…

- Advertisement -

మూడీస్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రేటింగ్‌ సంస్థ ఇలాంటి ఆరోపణలు చేసిందని విమర్శించింది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్‌ ఐడీ ఆధార్‌ అని పేర్కొంది. గత పదేళ్లుగా వంద కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారని తెలిపింది. తమ గుర్తింపును ధృవీకరించేందుకు ఎలాంటి అధ్యయనాలను ప్రస్తావించలేదని, ఈ సంస్థ చేసిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నం చేయలేదని ఉడాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆధార్‌ బయోమెట్రిక్‌ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండాఫేస్‌ అథెంటికేషన్‌, ఐరిస్‌ అథెంటికేషన్‌ వంటి కాంటాక్ట్‌లెస్‌ మార్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మూడీస్‌ విస్మరించిందని పేర్కొంది. చాలా కేసుల్లో మొబైల్‌ ఓటీపీని వినియోగించుకునే సదుపాయం అందుబాటులో ఉందని, సెంట్రలైజ్డ్‌ ఆధార్‌ వ్యవస్థలో భ ద్రతా, గోప్యతా ముప్పు పొంచి ఉందని నివేదికలో వాదించారని, కానీ ఆధార్‌ డేటాబేస్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఇప్పటికే పలు మార్లు పార్లమెంట్‌ ముందు నివేదించినట్లు ఉడాయ్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement