Friday, April 26, 2024

ఇంటర్‌లో పౌరశాస్త్రం సబ్జెక్టు రద్దు?! హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపుల్లో పౌరశాస్త్రం సబ్జెక్టు తొలగించే ఆలోచనలో ఇంటర్‌ బోర్డు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్ణయాలు అధ్యాపకులకు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. ఇంటర్‌లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా సమాజానికి ఉత్తమ పౌరులుగా తయారు చేసే ఆదరణ ఉన్న పౌరశాస్త్రం(సివిక్స్‌) కోర్సును రద్దు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న కోర్సులకు అదనంగా 6 కొత్త కోర్సుల ప్రశేపెట్టాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి బోర్డు ఇప్పటికే పంపించింది. అయితే ఇంటర్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయమే ప్రస్తుతం అధ్యాపకులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఉన్న కోర్సులను తీసేసి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడమేంటని ఇంటర్‌ పేపర్ల మూల్యాంకనంలో పాల్గొంటూనే వివిధ జిల్లాల్లో బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన బాట చేపట్టారు. ఇంటర్‌లో హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులున్నాయి. హెచ్‌ఈసీ గ్రూపులో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులు ప్రధానంగా ఉంటాయి. అదేవిధంగా సీఈసీలో కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. అయితే ఇందులోని సిివిక్స్‌(పౌరశాస్త్రం) సబ్జెక్టును తీసేసి ఆ స్థానంలో మూడు ఎలక్ట్రానిక్స్‌, మూడు కంప్యూటర్స్‌ సబ్జెక్టులు పెట్టేలా బోర్డు నిర్ణయించినట్లు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. అంటే సివిక్స్‌ సబ్జెక్టును తీసివేయడం ద్వారా ఇంటర్‌లో హెచ్‌ఈసీ గ్రూపు తీసుకునే విద్యార్థి ఆపైన సివిక్స్‌ స్థానంలో కొత్త సబ్జక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే హిస్టరీ, ఎకనామిక్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్‌ లేదా కంప్యూటర్స్‌కు సంబంధించిన ఏదేని ఒక కొత్త సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సీఈసీ గ్రూపులోనూ కామర్స్‌, ఎకనామిక్స్‌తో పాటు ఇంకొక కొత్త సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులను ప్రస్తుతం రాబోయే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలిసింది.

రాజ్యాంగాన్ని తొలగించినట్టే?…

ఇంటర్‌లో పౌరశాస్త్రాన్ని తొలగిండమంటే రాజ్యాంగాన్ని తొలగించడమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్‌ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలల్లోనూ దాదాపు ఈ సబ్జెక్టును బోధిస్తున్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు దాదాపు 1500 వరకు ఉండగా కొన్ని కాలేజీల్లో హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఈ సబ్జెక్టు బోధించే రెగ్యులర్‌, కాంట్రాక్టు అధ్యాపకులు సుమారు 450 వరకు ఉంటారు. ప్రైవేటులో బోధించే వారు అదనం. పౌరశాస్త్రాన్ని తొలగించడం ద్వారా ఆ సబ్జెక్టు బోధించే అధ్యాపకుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పౌరశాస్త్రంలో రాజ్యాంగము, ప్రభుత్వ, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర అంశాల గురించి తెలియజేస్తుంది. సమాజానికి ఉత్తమ పౌరులుగా తయారుచేసి రాజ్యాంగము గురించి తెలియజేసే ఇలాంటి సబ్జెక్టును తీసేయడం చాలా విచారకరమని అధ్యాపకులు మండిపడుతున్నారు.
చంద్రబాబు హయాంలోనూ ఇలానే హిస్టరీ సబ్జెక్టును తీసేయాలని అనుకున్నారు. హిస్టరీ స్థానంలో టూరిజం సబ్జెక్టుగా పెట్టాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే దీనిపై అధ్యాపకుల నుంచి అప్పట్లో పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయి. మళ్లిప్పుడు ఇంటర్‌లో పౌరశాస్త్రం తొలగించాలనే ఆలోచనన రావడం చాలా దారుణమని కాంట్రాక్టు అధ్యాపక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కొప్పిశెట్టి సురేశ్‌, టీఎస్‌జీసీసీఎల్‌ఏ

పౌరశాస్త్రం సబ్జెక్టు రద్దు చేసే ఆలోచనను ఇంటర్‌ బోర్డు విరమించుకోవాలి. పౌరశాస్త్రాన్ని తొలగించడమంటే రాజ్యాంగాన్ని తొలగించడమే. ప్రాథమిక విధులు, హక్కులు, ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇతర అంశాల గురించి విద్యార్థులకు బోధించే అంశాలు పౌరశాస్త్రంలో ఉంటాయి. సమాజంలో కీలకమైన సబ్జెక్టుగా ఉన్న పౌరశాస్త్రం సబ్జెక్టు విషయంలో ప్రయోగాలు చేయుెెద్దు. అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. పౌరశాస్త్రాన్ని తొలగించకుండా కొత్త సబ్జెక్టులను కూడా కొనసాగించేలా అధికారులు తమ ఆలోచనలను మార్చుకోవాలి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement