Thursday, April 25, 2024

పచ్చడి మెతుకులు కష్టమే.. సామాన్యుడికి అందనంటున్న మామిడి కాయల ధర..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పచ్చడి మెతుకులు తిని కడుపు నింపుకునే పేదలకు పెరిగిన ధరలతో అవి కూడా భారంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది మామిడి కాయ పచ్చడి పేదోడి కంచంలోకి రానంటోంది. ఈ ఏడాది మామిడి అందులోనూ పచ్చడి మామిడి కాయల దిగుబడి దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు నూనె, కారం, ధరలు కూడా ఆకాశన్నంటుతుండడంతో మామిడి పచ్చడిపై పేద, సామాన్యులు ఆశలు వదిలేసుకున్నారు. ఇంట్లోనే పచ్చడి తయారు చేసుకోవడంతోపాటు బయట మార్కెట్‌లో పచ్చడిని కొని తినే పరిస్థితులు లేవంటున్నారు. ప్రతి ఏటా మే నెలలో వచ్చే మామిడి కాయ పచ్చడి సువాసనలు చాలా వరకు తగ్గిపోయాయి. ఏటా మే రెండో, మూడో వారంలో ప్రతి తెలుగింట్లో మామిడికాయ పచ్చడి సందడి నెలకొంటుంది. ఈ సారి మామిడి పూత పెద్దగా రాకపోగా… వచ్చిన పూత కూడా తెగుహల్ల బారిన పడి నిలవలేదు. దీంతో మామిడి కాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో రూ.3 నుంచి రూ.5 వరకు లబించే పచ్చడి మామిడి కాయ ఇప్పుడు రూ.10 నుంచి రూ.15దాకా పలుకుతోంది. దీంతో 50 , 100 ఇలా పచ్చడి మామిడి కొనేందుకు వచ్చిన వినియోగదారులు 10, 20 , 30 కాయలు కొనుక్కొని వెనుదిరుగుతున్నారు. చాలా మంది పేద, సామాన్యులైతే అసలు కాయలు కొనకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితులు మార్కెట్లలో దర్శనమిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మామిడి పచ్చడి తయారీలో ఉపయోగించే ఎర్ర కారం ధర గతేడాది కేజీ రూ.480 ఉండగా ఈసారి అది ఏకంగా కేజీ రూ.740కు చేరుకుంది. అదేవిధంగా మామిడి పచ్చడిలో వినియోగించే ఆవ నూనె ధర గతేడాది లీటర్‌ రూ.300 ఉండగా ఈసారి రూ.400కు చేరుకుంది.

తెలుగువారితోపాటు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మామిడి పచ్చడిని ఇష్టంగా తింటారు. పేదల నుంచి ధ నవంతుల వరకు టిఫిన్‌ క్యారియర్లలో ప్రత్యేకంగా మామిడి కాయ పచ్చడి ఉండాల్సిందే. తినేందుకు కూరలు ఏమీ లేకున్నా… రెండు ఆవకాయ బద్దలు, అందులో పెరుగు వేసుకుని రోజులో మూడు పూటలు సునాయాసంగా తినేయొచ్చు. ప్రతి ఏటా మామిడి పచ్చడితో ఆహారాన్ని వడ్డించేవారమని, ఈ సారి మామిడి పచ్చడి కొనడం ఆర్థికంగా భారంగా మారిందని హోటల్‌, హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. మామిడి పచ్చడితోనే ప్రతి ఏటా చాలా మంది గృహిణులు తమ ఇంట్లోకూ, దూర ప్రాంతాల్లో ఉంటున్న బంధువుల, కుటుంబీకులకు పచ్చడిని తయారు చేసి పంపిస్తుంటారు. ఈసారి మామిడికాయలు, వంట నూనె, కారం, ఎల్లిపాయలు, మెంతులు, ఆవాలు, ఉప్పు తదితర పచ్చడి దినుసుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇంట్లో వాళ్ల కోసం సరిపోను పచ్చడి పెట్టడమే గగనమవుతోందని చాలామంది గృహిణులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దూరంలో ఉన్న బంధువులు, కుటుంబీకులకు ఎక్కడి నుంచి పంపేది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా చాలా మంది ఆర్డర్లపై మామిడి కాయ పచ్చడిని తయారు చేసి అమ్మేవారు. అయితే పెరిగిన ధరల కారణంగా గతేడాదితో పోల్చితే ఈసారి కనీసం 30శాతం ఆర్డర్లు కూడా రావడం లేదని, తమ ఉపాధి దెబ్బతిందని వాపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement