Monday, April 29, 2024

రేవంత్ కు సీఎల్పీ నేత మద్దతు ఇస్తారా?

తెలంగాణ పీసీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ ని తొలి నుంచి వ్యతిరేకించిన వారు.. ఆయనతో కలిసి పనిచేస్తారా? రేవంత్ కు సహకరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రేవంత్ మాత్రం తనను వ్యతిరేకించిన నాయకులతోపాటు మద్దతు ఇచ్చిన వారందరిని వరుసగా కలుస్తున్నారు. వ్యక్తిగతంగా వైరం ఉన్నా.. పార్టీ కోసం అందరం కలిసి పని చేద్దాం అని కోరుతున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతు కూడగట్టడంలో మాజీ ఎంపీ మల్లు రవి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్లను కలుస్తూ రేవంత్‌కు మద్దతునివ్వాలని కోరుతున్నారు. రేవంత్‌ను వ్యతిరేకించిన వారిలో ఒకరైన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు. రేవంత్ మద్దతు ఇవ్వాలంటూ తన తమ్ముడైన భట్టిని మల్లు రవి కోరడం ఆసక్తి రేపింది.

రాష్ట్రంలో పీసీసీ ఎంత ముఖ్యమో.. సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యం. పీసీసీ, సీఎల్పీ రెండు కళ్లలాంటివి. నిజానికి పీసీసీ పదవిని మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుకు ఇవ్వాలని భట్టి కోరారు. అయితే, అధిష్ఠానం మాత్రం రేవంత్‌ వైపు నిలిచింది. అధిష్టాన నిర్ణయంతో కొందరు సీనియర్లు పార్టీకి రాజీనామా చేయగా.. కోమటిరెడ్డి లాంటి నాయకులు గాంధీ భవన్ మెట్లే ఎక్కనని భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న నాయకులను రేవంత్ రెడ్డి సహా మల్లు రవి సమావేశం అవుతున్నారు.  ఈ క్రమంలో ఇప్పిటికే చాలా మంది సీనియర్లను కలిసిన రేవంత్.. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టిని కూడా కలవబోతున్నారు. భట్టి మద్దతు రేవంత్ కు ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. అందుకు అందరి సహకారం కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు లేవని, టీ కప్పులో తుఫాను లాంటివే ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రలతో పాటు కర్ణాటకలోని పలువురు కాంగ్రెస్ నాయకులను కూడా ఆహ్వానించారు. మరి ప్రమాణస్వీకారానికి రేవంత్ ను వ్యతిరేకించిన నాయకులు హాజరవుతారా? లేదా ? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: హరీష్ రావు ఇలాకాలో టెన్షన్.. మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

తాజా వార్తలు

Advertisement