Sunday, April 28, 2024

రాజగోపాల్‌ రెడ్డి స్వార్ధం వల్లే ఉప ఎన్నిక : మంత్రి హ‌రీష్ రావు

రాజ‌గోపాల్ రెడ్డి స్వార్ధం వ‌ల్లే మునుగోడు ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజీనామా చేశాడని, డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనే అహంకారంతో బీజేపీ ఉందన్నారు. ఎనిమిదేండ్లుగా అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. క‌న్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మండిప‌డ్డారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు. మునుగోడులో మాత్రం రూ.3 వేల పింఛన్‌ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉండదని చెప్పారు. బీజేపీవన్నీ జుమ్లా మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుబ్బాక ఉపఎన్నిక సమయంలో రూ.3 వేల పింఛన్‌ ఇస్తామన్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని బీజేపీ నాయకులను నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారివి అమలుకాని హామీలు, అబద్ధపు ప్రచారాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌తో మునుగోడు బాధపడిందని, గతంలో పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు ఫ్లోరైడ్‌ బాధలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ తెచ్చారని, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని వెల్లడించారు. మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించిన ఘనత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement