Thursday, April 25, 2024

బుల్లెట్‌ ట్రైన్‌ బాస్.. సర్వీస్‌ నుంచి తొలగింపు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్‌ ట్రయిన్‌ ప్రాజెక్టు ఇన్‌చార్జి, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌ అగ్నిహోత్రిని రైల్వే శాఖ సర్వీస్‌ నుంచి తొలగించింది. ఆయన అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంది. బుల్లెట్‌ ట్రయిన్‌ ఇన్‌చార్జి బాధ్యతలను రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. ఆయన ఈ పదవిలో మూడునెలల పాటు కొనసాగుతారు. సీనియర్‌ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సిఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌ అగ్నిహోత్రి రైల్‌ వికాస్‌ నిగం లిమిటెడ్‌ సీఎండీగా తొమ్మిదేళ్లపాటు పని చేశారు. ఆ సమయంలో ఓ ప్రయివేటు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు జరిగాయేమో దర్యాప్తు చేయాలని సీబీఐను లోక్‌ పాల్‌ జూన్‌ 2న ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 12లోగా నివేదిక సమర్పించాలని తెలిపింది. అనధికారికంగా ఓ ప్రయివేటు కంపెనీకి నిధులను మళ్లించారని అగ్నిహోత్రిపై ఆరోపణలు వచ్చాయి.

అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సర్వీస్‌ నుంచి రైల్వేశాఖ తొలగించి, బుల్లెట్‌ ట్రయిన్‌ ప్రాజెక్టు ఇన్‌చార్జి బాధ్యతలను మూడు నెలలపాటు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్‌ డైరెక్టర్‌ ( ప్రాజెక్ట్‌ ) రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుల అమలు కోసం భారత ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్‌. అగ్ని హోత్రి పదవీ విరమణ తర్వాత ఓ ఏడాదిలోగానే ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని రైల్వే అధికారులు తెలిపారు. రిటైర్డ్‌ అధికారులు తాము పదవి విరమణ చేసిన తర్వాత ఓ ఏడాది నిండక ముందే ఏదైనా కంపెనీలో, వాణిజ్య సంస్థలో ఉద్యోగం పొందకూడదని, ఒక వేళ ఓ ఏడాదిలోగా ఉద్యోగాన్ని స్వీకరించాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్ననాయన్నారు. అగ్నిహోత్రి ఈ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలను అగ్నిహోత్రి త్రోసిపుచ్చారు. తాను ఏ కంపెనీకైనా అనుకూలంగా పని చేయలేదన్నారు. ఇటువంటి పనులను చేసే ఏ కంపెనీలోనూ తన కుమారుడు పని చేయడం లేదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement