Friday, May 10, 2024

31నుంచి బడ్జెట్‌ సమావేశాలు!

పార్లమెంట్‌ బడ్జెట్‌ (2023-24) సమావేశాలు ఈనెల 31న ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటిసెషన్‌ జనవరి 31నుంచి ఫిబ్రవరి 10వరకు జరుగుతుంది. రెండవ సెషన్‌ మార్చి 6నుంచి ఏప్రిల్‌ 6వరకు జరుగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు సూచన ప్రాయంగా పేర్కొన్నాయి. ఈ సమావేశాల తొలిరోజునే ఆర్థికసర్వే నివేదికను ఉభయసభల్లో ప్రవేశపెడతారని తెలిపారు.

బడ్జెట్‌ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చిస్తారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తారని వెల్లడించారు. రెండవ విడత సమావేశాల్లో వివిధ మంత్రిత్వశాఖలకు నిధుల కేటాయింపుపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు. రెండవ విడత సమావేశాలు పార్లమెంట్‌ నూతన భవనం సెంట్రల్‌ విస్టాలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త భవనం నిర్మాణపనులు చురుగ్గా సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement