Saturday, May 11, 2024

Delhi | బడ్జెట్ భేష్, ఏపీకి నిరాశాజనకం.. వైఎస్సార్సీపీ సాధించిందేంటి? : ఎంపీ రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేదిగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపీ (శ్రీకాకుళం) కే. రామ్మోహన్ నాయుడు అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం నిరాశజనకంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్ల లోపు అన్ని హామీలను పూర్తిచేయాల్సి ఉందని, కానీ బడ్జెట్లో వాటి ప్రస్తావన లేదని ఉదహరించారు. ఇందుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే తీసుకోవాలని అన్నారు.

రాష్ట్రం కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు సాధించిందేమీ లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “అధికారం కావాలి… ముఖ్యమంత్రి పదవి కావాలి… ఎంపీలు కావాలి.. అవి ఇస్తే అన్నీ సాధిస్తాం” అంటూ ఏవేవో చెప్పారని, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఒక్క అంశంపై కూడా గట్టిగా పోరాడలేకపోతోందని అన్నారు. టీడీపీ హాయాంలో పోలవరం 70% పూర్తయిందని, జగన్ హయాంలో ఒక్క శాతం పనులు కూడా ముందుకు కదల్లేదని విమర్శించారు. ఆనాడు తాము చేసిన ఒత్తిడితో కేంద్రం రైల్వే జోన్ ప్రకటించిందని, కానీ వైఎస్సార్సీపీ ఎంపీలు జోన్ కోసం ఒక ఇటుక కూడా వేయించలేకపోయారని ఎద్దేవా చేశారు.

నాలుగేళ్లుగా విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల భవనాలు కూడా కట్టించలేకపోయారని అన్నారు. ఆనాడు కేంద్రంతో పోరాడి వెనుకబడిన జిల్లాలకు నిధులు తీసుకొచ్చామని, కానీ వైఎస్సార్సీపీ ఎంపీలు వెనుకబడిన ప్రాంతాలకు ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని అన్నారు. తాము స్టీల్ ప్లాంట్ ని కాపాడగలిగామని, కానీ వైఎస్సార్సీపీ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదని అన్నారు.

- Advertisement -

చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని అడిగి వాటి వివరాలను మీడియాకు వెల్లడించేవారని గుర్తుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పిరికివాడని, ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సీబీఐ, ఈడి కేసుల మాఫీ గురించి మాట్లాడుకోవడం లేదంటే అప్పుల మీద అప్పులు తెచ్చుకోవడం తప్ప రాష్ట్రం గురించి ఒక్కనాడూ మాట్లాడింది లేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మాయమాటలు చెప్పడం తప్ప చేస్తున్నదేమీ లేదని అన్నారు. రాష్ట్రం కోసం తాము ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేశామని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేయడంలో వైఎస్సార్సీపీ దిట్ట అని అన్నారు. రాష్ట్రానికి ఏమీ సాధించలేనప్పుడు వైఎస్సార్సీపీకి చెందిన 31 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement