Tuesday, November 28, 2023

Delhi | మచిలీపట్టణం మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ.. కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ బాలశౌరి హర్షం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆర్ధిక మంత్రి నిర్మలా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మచిలీపట్టణంలో ఉన్న మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంపై వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధామంత్రి, సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
   

మచిలీపట్టణం ప్రాంతంలోని విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావడమే కాక రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయని అన్నారు. నర్సింగ్ కోర్సులకు డిమాండ్ ఉండడం వల్ల మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే మత్స్య కారుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి 6 వేల కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల మచిలీపట్టణం పరిధిలోని మత్య్సకారులకు మేలు జరుగుతుందన్నారు. మత్స్యకారులకు రొయ్యల మేతకు సంబంధించిన దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం అభినందనీయ పరిణామమని బాలశౌరి కొనియాడారు.

వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, మత్స్య రంగాల పరిశ్రమలకు చేయూతనిచ్చేలా అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్‌ను ఈ బడ్జెట్‌లో 20 లక్షల కోట్లకు పెంచడం వల్ల ఆయా రంగాలు, వాటి మీద ఆధారపడ్డ వారికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతుకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు గణనీయంగా తగ్గింపులు, త్వరగా పాడైపోయే పంటలకు సహాయపడే పథకాలను విస్మరించడం, కనీస మద్దతు ధరకు సహకారం అందించేలా ఉన్న పథకాన్ని శోచనీయమన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ. 79,500 కోట్లు, ఇంటింటికి మంచి నీటి కుళాయిలకు జల్ జీవన్ మిషన్‌కు 70 వేల కోట్లు, ఔషధాల తయారీ రంగానికి , ఏకలవ్య మోడల్ స్కూళ్ళకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే విద్యుత్ వాహనాల తయారీ రంగానికి అధిక మొత్తం లో నిధులు కేటాయించడంపై బాల శౌరి హర్షం వ్యక్తం చేశారు.

పోలవరానికి సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందని ఆయన వాపోయారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ మనోభావాలను అర్థం చేసుకుని రైల్వే జోన్‌పై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వ్యవహారం మీదా బాలశౌరి స్పందించారు. కొందరు పార్టీ వీడి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు బురద జల్లడం సహజమని చెప్పారు. చంద్రబాబు సమయంలో ట్యాపింగ్ ఆయుధం కొన్నారంటే కొనలేదన్నారని, మరి అలాంటప్పుడు ట్యాపింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ను ఒకరు రికార్డ్ చేసి టాపింగ్ అంటే ఎలా అవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement