Sunday, April 28, 2024

BRS – తెలంగాణ గళం, బలం, దళం బీఆర్ఎస్ పార్టీనే – కేటీఆర్

హైదారాబాద్ – తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ అనే పేరు మాయం అవుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంగా కేసీఆర్‌ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆన్నారు.

బీఆర్‌ఎస్‌పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని కొందరు చెప్పారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అక్కడక్కడ బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు చెప్తామన్నారు కేటీఆర్.

తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంటులో చూడాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణనే అని చెప్పారు. దేశంలో ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కో నేత గుర్తు వస్తారని, అలా జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్‌ పేరు మాత్రమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ వల్ల తెలంగాణ వచ్చింది, ఈ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదని విమర్శించారు.

తెలంగాణ గురించి పార్లమెంటులో రాహుల్‌, మోడీ ఎప్పుడైనా మాట్లాడారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ అనే పేరు అనామకంగా అవుతుందన్నారు. తెలంగాణ డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మళ్లీ మంచి అవగాహన ఏర్పడిందన్నారు. రేవంత్‌ రెడ్డిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పొగుడుతున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement