Tuesday, April 30, 2024

భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురండి.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజ్ఞప్తి

ఐక్య‌రాజ్య స‌మితి భద్రతామండలిలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలన్నింటిలోనూ సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాలున్న వ్యవస్థలన్నింటీలోనూ సంస్కరణలు అమలు చేయాలన్నారు. కరేబియన్‌లో పర్యటిస్తున్న రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆ దేశ పార్లమెంట్‌లో సభ్యులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. అన్ని దేశాలలో బలమైన, స్థిరమైన, సమతుల్యమైన మరియు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి బహుపాక్షికతను ఒక సాధనంగా ఉపయోగించాలన్నారు. అయితే బహుపాక్షికత సంబంధితంగా, ప్రభావవంతంగా ఉండాలంటే సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

”రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఉద్భవించిన నిర్మాణాలు, సంస్థలు ఒక ప్రధాన సమస్యపై దృష్టి సారించాయి. మరొక ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడంతోపాటు నేటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, నిర్మించాలనుకుంటున్న నూతన ప్రపంచం కోసం ప్రతి దేశం ప్రయత్నించాలి” అని పిలుపునిచ్చారు. సమ్మిళిత ప్రపంచ క్రమం కోసం భారత్‌ తన వంతు కృషి చేస్తోందన్నారు. సార్వత్రిక నియమాల ఆధారిత, పారదర్శక, వివక్షతలేని మరియు సమానమైన బహుపాక్షిక వ్యవస్థ కోసం కృషి చేస్తోందన్నారు. సమకాలీన ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించేలా ఐరాస భద్రతా మండలి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రపంచ సంస్థల సంస్కరణ అవసరమని రామ్‌నాథ్‌ కోవింద్‌ మరోమారు నొక్కివక్కాణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement