Sunday, May 5, 2024

మహ్మద్​ ప్రవక్తపై బీజేపీ నేతల కామెంట్స్‌.. కువైట్​లో భారతీయ ఉత్పత్తుల అమ్మకాలు బంద్‌

సస్పెండైన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్‌ నవీన్‌కుమార్‌ జిందాల్ ఈ మ‌ధ్య మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం దేశంతోపాటు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. బీజేపీ నేతల వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దిగజార్చాయి. బీజేపీ నేతల వివాదస్పద వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతార్‌, కువైట్‌ వంటి దేశాలు నిరసన తెలిపాయి. కొన్ని ముస్లిం దేశాలు భారత రాయబారులను పిలిపించి సంజాయిషీ కోరాయి. మరోవైపు కువైట్‌లోని వ్యాపార సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై నిరసనగా భారతదేశ‌ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి.

కువైట్‌ సిటీలోని అల్-అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్ ర్యాకుల నుంచి ఇండియన్‌ టీ, ఇతర ఉత్పత్తులను తొలగించారు. అలాగే కువైట్‌ నగరం వెలుపల ఉన్న ఒక సూపర్‌ మార్కెట్‌లోని ర్యాకుల్లో ఉన్న రైస్‌, ఇతర భారతీయ ఉత్పత్తులపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పారు. ‘భారతీయ ఉత్పత్తులను తొలగించాం’ అని అక్కడ నోటీస్‌ ఉంచారు. ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కువైటీ ముస్లిం ప్రజలు ఏ మాత్రం సహించరని ఆ స్టోర్‌ సీఈవో నాసర్‌ అల్-ముతైరి తెలిపారు. తమ సంస్థకు చెందిన అన్ని స్టోర్లలో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేసినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement