Thursday, May 2, 2024

Nanded: బీజేపీ ప్ర‌భుత్వం ఎవ‌రి ముందు త‌ల‌దించుకోదు.. మోడీ

ఎవ‌రినీ లొంగ దీసుకోదు కూడా..
బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నిర్మిద్దాం..
మీ ఓటు ద్వారా మ‌రోసారి అవ‌కాశం ఇవ్వండి..
రాకుమారుడికి వ‌య‌నాడ్ లో ఓట‌మి భ‌యం..
మ‌రో సుర‌క్షిత స్థానం కోసం పాకులాట..
విద‌ర్భ ప్ర‌చార స‌భ‌లో మోడీ…

నాందేడ్ – కాంగ్రెస్ వైఖరి వల్ల ఇక్కడి రైతులు పేదలుగా మారారని, పరిశ్రమలకు సంబంధించిన అవకాశాలు నాశనమ‌య్యాయని ప్ర‌ధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈరోజు జరిగిన ర్యాలీలో ఆయ‌న ప్రసంగిస్తూ… ఇండియా కూటమిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. భారతదేశ రక్షణ రంగాన్ని కాంగ్రెస్ బలహీన పరిచిందని, వారు సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడంలో తమ స్వప్రయోజనాలను కూడా చూస్తున్నారని విమర్శించారు. వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను పొందకుండా ఉండేందుకు వారు తమ శక్తినంతా ఎలా ఉపయోగించారో దేశం మొత్తం చూసిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే తేజస్ యుద్ధ విమానం కూడా మన రక్షణ వ్యవస్థలో ఉండేవి కావన్నారు.

బీజేపీ చేసిన వాగ్దానాలను మరోసారి ప్ర‌స్తావించిన మోడీ. ప్రతి కుటుంబానికి రేషన్, చికిత్స ఖర్చు ముఖ్యమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 5 సంవత్సరాలకు ఉచిత రేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ ఉచిత రేషన్ తో పాటు గ్యాస్ కనెక్షన్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ యోజన పేదలను లక్షల రూపాయల ఖర్చు నుండి కూడా కాపాడుతుందనీ, మన దేశంలో పేదలతో పాటు 70 ఏళ్లు పైబడిన వారెవరైనా.. ఉచిత చికిత్స పథకం ప్రయోజనం పొందుతారని మోడీ హామీ ఇచ్చారు.

యువ‌రాజుకు ఓట‌మి భ‌యం …
రాహుల్ గాంధీ మొదట అమేథీని వదిలి కేరళలోని వయనాడ్‌కు వెళ్లారని మోడీ చెప్పారు. ఇప్పుడు వయనాడ్‌లో కూడా ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తాజాగా ఈ ప్రిన్స్ (రాహుల్ గాంధీ) ఇప్పుడు వయనాడ్‌ని వదిలి మరో సురక్షిత సీటు కోసం వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.. అలాగే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని గురించి మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందార‌ని.. కానీ, ఈసారి రాజ్యసభ ద్వారానే ప్రవేశించారని దెప్పి పొడిచారు.

- Advertisement -

ఐదేళ్ల‌లో బ‌ల‌మైన ఆర్ధిక శ‌క్తిగా తీర్చిదిద్దుతాం…
రానున్న ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే పెద్ద శక్తిగా మార్చేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా యుద్ధ మేఘాలు ఎలా కమ్ముకుంటున్నాయో చూస్తారనీ, ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు భారతదేశంలో యుద్ధ ప్రాతిపదికన శాంతియుతంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పనిని వివరిస్తూ.. గత 10ఏళ్లలో సుస్థిర ప్రభుత్వం.. దేశప్రజల ప్రయోజనాల కోసం ఎలా పనిచేస్తుందో చూశామన్నారు. కరోనా సంక్షోభం సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందనీ, దేశంలోని ప్రతి పౌరుడిని రక్షించిందని తెలిపారు. అలాగే.. ప్రపంచ దేశాలకు భారత్ అండగా నిలిచిందని తెలిపారు.

బీజేపీ ప్ర‌భుత్వం ఎవ‌రికీ లొంగ‌దు…
బీజేపీ ప్రభుత్వం ఎవరినీ లొంగదీసుకోవడం లేదని, ఎవరి ముందు తలవంచడం లేదన్నారు. భారత్‌కు చవకగా చమురు లభించాలి, కాబట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నామనీ, భారతీయ రైతులకు సరిపడా ఎరువులు అందేలా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. నేడు పాక్ ఆహారధాన్యాల కోసం కొట్టుమిట్టాడుతోందని, ప్రపంచంలోని అనేక దేశాల్లో చాలా దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నాయనీ, చాలా దేశాలు ఆర్ధికంగా దివాళా తీస్తున్నాయని పేర్కొన్నారు. మన పొరుగుదేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషించి నేడు ఆహారం కోసం తహతహలాడుతుందని ప్రధాని అన్నారు. గుప్పెడు గోదుమ పిండి కోసం ఆ దేశ ప్ర‌జ‌లు అల్లాడుతున్నార‌ని అన్నారు.. కానీ ప‌దేళ్ల పాల‌న‌లో ఆహార కొర‌త లేకుండా చూశామ‌ని, మిగులు బియ్యాన్ని పేద‌ల‌కు ఉచితంగా అందిసున్నామ‌ని చెప్పారు మోదీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement