Thursday, September 21, 2023

బీజేపీ బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు.. కొల్లాపూర్‌లో ప్రారంభమై మలక్‌పేటలో ముగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికల హడావుడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ సైతం బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసింది. బస్సు యాత్రను ఈనెల 26 నుంచి చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. అయితే తాజాగా బస్సు యాత్రల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. కృష్ణా జోన్‌ నుంచి సౌత్‌ వెస్ట్‌ మార్గంలో మొదటి యాత్రను చేపట్టాలని యాత్ర రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేసింది. కొల్లాపూర్‌లో యాత్ర ప్రారంభమై మలక్‌పేటలో ముగియనుంది.

ఈ యాత్ర 19 రోజుల పాటు 1315 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇదిలా ఉంటే బస్సు యాత్రలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. ఈనెల 26 నుంచి యాత్రలను మొదలు పెట్టి అక్టోబర్‌ 13 కల్లా ముగించాలని సంకల్పించింది. మూడు మార్గాల్లో చేపట్టబోయే బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసే విధంగా రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు. ప్రస్తుతమైతే ఇప్పటి వరకు కృష్ణా జోన్‌-సౌత్‌ వెస్ట్‌ బస్సు యాత్ర రూట్‌ మాత్రమే ఖరారు అయినట్లు తెలిస్తోంది. మిగతా భద్రాచలం, బాసరా నుంచి మొదలు పెట్టే యాత్రల రూట్‌ మ్యాప్‌ ఖరారు కావాల్సింది.

- Advertisement -
   

కృష్ణాజోన్‌ రూట్‌ మ్యాప్‌ ఖరారు అయిన నేపథ్యంలో బాసరా, భద్రాచలం నుంచి ప్రారంభం కాబోయే రూట్‌ మ్యాప్‌ కూడా ఒకట్రెండు రోజుల్లో ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బస్సు యాత్రల ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేస్తోంది, ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిని ప్రజలకు వివరించడంతో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి ఈయాత్రల ద్వారా చేరవేయనున్నట్లు బీజేపీ సీనియర్‌ నేత ఎన్‌వి.సుభాష్‌ మీడియాతో చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీలోని ముఖ్య నేతలందరూ ప్రజల్లోకి వెళ్లేలా నిర్ణయించిన కార్యాచరణలో భాగంగా బస్సు యాత్రను మూడు రూట్లలో ఖరారు చేసినట్లు నేతలు చెబుతున్నారు. మరోవైపు ఒకే నేత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలను నిర్వహించడం కష్టమైన నేపథ్యంలో మూడు రూట్లలో ఒక్కో రూట్‌లో ఒక్కో ముఖ్య నేతల నేతృత్వంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈమేరకు యాత్రల కార్యాచరణ రూపొందిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక బస్సు యాత్ర తరహా పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల మీద, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు నిరుద్యోగుల సమస్యల పరిస్కారం కోసం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.

తాజాగా మూడు రూట్లలో చేపట్టనున్న బస్సు యాత్రల్లో ఒక రూట్‌కు కిషన్‌ రెడ్డి నేతృత్వం నిర్వహించడంతోపాటు మిగతా రెండు రూట్ల యాత్రలను కూడా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. అయితే బస్సు యాత్రల రూట్లు ఖరారైనా… ఏ నేతలు ఎవరెవరు ఎక్కడి నుంచి యాత్రలకు నేతృత్వం వహిస్తారన్నది ఇప్పటివరకు ఖరారు కాలేదు. అయితే బద్రాచలం నుంచి కిషన్‌ రెడ్డి, బాసరా నుంచి బండి సంజయ్‌, కొల్లాపూర్‌ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రకు ఈటల రాజేందర్‌ లేదా డీకే అరుణ నేతృత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ పేర్లు అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రంలోని 11లోక్‌సభ స్థానాల పరిధిలో ఉన్న 18 జిల్లాలల్లో వివిధ విడతల్లో 116 రోజులపాటు పాదయాత్రలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు, వారితో మమేకమయ్యారు. గ్రామగ్రామాన బీజేపీని తీసుకెళ్లారు. ఆయన యాత్రతో బీజేపీలో ఫుల్‌ జోస్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట తాజాగా చేపట్టబోయే బస్సు యాత్రలు కూడా పార్టీకి మంచి మైలేజీ ఇస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశాభావంతో ఉంది.

ఒక్కో నియోజకవర్గంలో 10 నుంచి 100 కి.మీ.

బీజేపీ పట్టున్న మొత్తం 40 నియోజకవర్గాల్లో మొదట యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది. మొదటి రోజు కొల్లాపూర్‌లో ప్రారంభమయ్యే యాత్ర 10 కిలోమీటర్లు సాగనుంది. చివరి రోజు 19వ రోజు చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట్‌కు చేరుకొని ముగియనుంది. అయితే ఒక్కో నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు సాగనుంది.

వనపర్తి, అలంపూర్‌లో 140 కిలోమీటర్లు, గద్వాల్‌, మక్తల్‌లో 105 కి.మీ., సూర్యాపేట్‌, తుంగతూర్తిలో 100 కి.మీ., మునుగోడు, ఇబ్రహీంపట్నంలో 110 కిలోమీటర్లు సాగనుంది. నారాయణ్పేట్‌, మహబూడ్‌నగర్‌, కొడంగల్‌, తాండూర్‌, వికారాబాద్‌ నుంచి కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, ఆలేరు, భువనగిరి, నకిరేకల్‌, నల్గోండ, మునుగోడు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మీదుగా వచ్చి రాజేంద్ర నగర్‌, శేరిలింగంపల్లి, యాకత్‌పుర, సికింద్రాబాద్‌, మలక్‌పేట్‌కు చేరుకుంటుంది. ఈ నియోజకవర్గాల్లో 10 నుంచి 90 కిలోమీర్లలోపు యాత్ర ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement