Monday, July 15, 2024

Delhi | ఆ పార్టీలు తల్లీబిడ్డలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌పై బీజేపీ ఆరోపణలు!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తల్లీబిడ్డల వంటివని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. పంచుకున్నాయని ఆయన మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా మాట్లాడిన ఆయన.. బీజేపీని బలహీనపరిచేందుకు కుట్రపూరితంగా బీఆర్ఎస్‌తో సంబంధాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. చరిత్ర చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయని, ఆ మాటకొస్తే బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు రాజకీయ జీవితం మొదలైందే కాంగ్రెస్ పార్టీలోనని గుర్తుచేశారు.

కేసీఆర్ నరనరాన కాంగ్రెస్ రక్తమే ఉందని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలతో అంటకాగిన చరిత్ర బీఆర్ఎస్ ది అని డా. లక్ష్మణ్ అన్నారు. అలాంటి పార్టీతో బీజేపీ ఎందుకు స్నేహం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి లక్ష్యం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమేనని.. ఆ క్రమంలో కలిసి పనిచేస్తూ తమపై బురదజల్లుతున్నాయని వివరించారు.

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆయన మరోసారి గెలవాలని చూస్తున్నారని లక్ష్మణ్ సూత్రీకరించారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ చెలిమి గురించి చెప్పాలంటే చాలా ఉదాహరణలున్నాయని, 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులను కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ అడ్డుకుందని అన్నారు. తాజాగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన విపక్షాల సమావేశాలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు హాజరై, వారితో కలిసి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశారని గుర్తుచేశారు.

తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనతాదళ్ (సెక్యులర్)ను బలపరిచి బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు మద్దతిస్తూ బీజేపీని ఓడించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ దేశ ప్రజలకు తెలుసు అని డా. లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీని అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తు ఉంటే కాంగ్రెస్‌తో ఉంటుంది తప్ప మతతత్వ బీజేపీతో కాదు అని కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ గుర్తుచేశారు.

తెలంగాణకు పట్టిన చెదను వడిలించేది ఒక్క బీజేపీ మాత్రమేనని, నలుగురి కోసమా… 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసమా అన్నది ప్రజలే తేల్చుకోవాలని ఆయనన్నారు. మరోవైపు భారత నాయకత్వంలో ఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాలు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో జరిగాయని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాలు కూడా భారత్ నమోదు చేసిందని కొనయాడారు.

ప్రతియేటా ఏదో ఒక దేశంలో ఇవి జరుగుతూ ఉంటాయని, కానీ భారత నాయకత్వంలో ఈ ఏడాది జరిగిన సమావేశాలు మాత్రం అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్టను అనేక రెట్లు పెంచాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రణాళిక, ముందుచూపుతోనే ఇది సాధ్యపడిందని ప్రశసించారు. ఈ విజయాన్ని చూసి విపక్ష కూటమి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్ అభ్యర్థులపై కసరత్తు చేశామని, త్వరలోనే తెలంగాణ అభ్యర్థులపై కసరత్తు చేస్తామని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement