Monday, April 29, 2024

Big Story: జీఎస్‌టీలో ఇక మూడు స్లాబులే.. 5 శాతం వస్తువులు 8 శాతంలోకి..

రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పెంచే దిశగా వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్‌టీ కౌన్సిల్‌) అడుగులు వేస్తున్నది. శ్లాబుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లో జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ కానుంది. ఈ భేటీ సరికొత్త జీఎస్‌టీ స్లాబ్‌లు చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అతి తక్కువ జీఎస్‌టీ స్లాబ్‌ కింద 5 శాతం ఉంది. దీన్ని 8 శాతానికి పెంచేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా జీఎస్‌టీ స్లాబుల సంఖ్యను కూడా తగ్గించాలనే ఆలోచనలో జీఎస్‌టీ మండలి ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నిర్ణయం ఆదాయం పెంపునకు ఎంతో సహకరిస్తుందని భావిస్తున్నది. రాష్ట్రాలపై ప్రస్తుతం ఉన్న ఆదాయ భరితమైన ఆధారం తగ్గనుంది. అత్యల్ప స్లాబ్‌ను పెంచడం, స్లాబ్స్‌లో హేతుబద్దీకరించడం సహా ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ చర్యలను సూచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం ఈ నెలాఖరులోగా తన నివేదికను జీఎస్‌టీ కౌన్సిల్‌కు అందజేసే అవకాశం ఉంది.

ఇప్పుడు.. 5, 12, 18, 28శాతం..

జీఎస్‌టీ కౌన్సిల్‌కు సంబంధించిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం జీఎస్‌టీలో 5, 12, 18, 28 శాతంతో కూడిన పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. ఇందులో 5 శాతాన్ని 8 శాతం పెంచాలని మృంతుల బృందం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అత్యవసరమైన వస్తువులను అత్యల్ప స్లాబ్‌ నుంచి మినహాయించబడుతాయి లేదా.. పన్ను విధించబడుతాయి. లగ్జరీ, డీమెరిట్‌ వస్తువులు అత్యధిక స్లాబ్‌లోనే ఉండనున్నాయి. లగ్జరీ, సిన్‌ గూడ్స్‌ అత్యధిక స్లాబ్‌ 28 శాతంపైన సెస్‌ను కూడా విధిస్తున్నారు. ఫలితంగా వచ్చిన ఈ సెస్‌ వసూళ్లు.. రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. దీనికితోడు 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా తొలగించే ఆలోచనలో జీఎస్‌టీ కౌన్సిల్‌ ఉన్నట్టు సమాచారం. దీంతో కేవలం 8, 18, 28 శాతం స్లాబులు మాత్రమే ఉంటాయి. 12 శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్న వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అత్యవసర వస్తువులు అన్నీ 5 శాతం స్లాబ్‌లోనే ఉన్నాయి.

డెయిరీ ఉత్పత్తులపై జీఎస్‌టీ!

5 శాతం స్లాబ్‌లోని వస్తువులను 8 శాతం జీఎస్‌టీ ఉన్న స్లాబ్‌లోకి మారిస్తే.. ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ లెక్కల ప్రకారం.. ప్రభుత్వానికి ప్రతీ ఏటా భారీ ఆదాయం ఖజానాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 నుంచి 8 శాతం స్లాబ్‌లోకి మార్చడంతో.. ప్రతీ ఏటా అదనంగా రూ.1.50లక్షల కోట్లు వసూలు అవుతాయి. ఈ విషయాన్ని మంత్రుల బృందం తమ నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం జీఎస్‌టీ లెక్కల ప్రకారం.. అతి తక్కువ పన్ను స్లాబును 1 శాతం పెంచితే.. అదనంగా మరో రూ.50వేల కోట్ల ఆదాయం కూడా ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జీఎస్‌టీ మినహాయింపు వర్తిస్తున్న వస్తువుల సంఖ్యను తగ్గించాలనే ప్రతిపాదన కూడా మంత్రుల బృందం ప్రతిపాదించినట్టు సమాచారం. ప్యాక్‌ చేయని, బ్రాండెడ్‌ కాని ఆహార, డెయిరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్‌టీ నుంచి మినహాయింపు లభిస్తున్నది. వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో.. వీటిపై జీఎస్‌టీ విధించేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

నివేదికపై విస్తృత చర్చ..

జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ఆరంభంలో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో మంత్రుల బృందం అందజేసే నివేదికపై విస్తృతంగా చర్చిస్తారు. జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్‌తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులను ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. 2017, జులై 1 నుంచి జీఎస్‌టీ విధింపు అమల్లోకి వచ్చింది. జూన్‌, 2022తో జీఎస్‌టీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కానున్నాయి. జీఎస్‌టీ అమలుతో ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు జూన్‌, 2022 వరకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీనికి 2015-16 నాటి రాష్ట్రాల ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని.. ప్రతీ ఏటా 14 శాతం వృద్ధిని పరిగణలోకి తీసుకుని నష్టాన్ని లెక్కిస్తామని తెలిపింది.

28 శాతం స్లాబ్‌లో 35 వస్తువులే..

గత ఐదేళ్లలో.. పరిశ్రమ, వ్యాపార వర్గాల డిమాండ్‌తో పలు వస్తువులపై జీఎస్‌టీ రేట్లను తగ్గించుకుంటూ వచ్చింది. దీంతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది. ఫలితంగా ఆర్థికంగా లోటు ఏర్పడింది. జీఎస్టీ ప్రారంభంలో.. 28 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లో 228 వస్తువులు ఉండేవి. ప్రస్తుతం అవి 35కు తగ్గించబడ్డాయి. ఈ నేపథ్యంలో రేట్లను హేతుబద్దీకరించాలన్న డిమాండ్‌ కూడా ముందుకు వచ్చింది. దీంతో దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ.. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో జీఎస్‌టీ మండలి గత ఏడాది ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా.. అన్ని కోణాల్లో ఆలోచించి.. 5 శాతం స్లాబ్‌లోని వస్తువులను 8 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లోకి చేర్చి.. 12 శాతం స్లాబ్‌ను ఎత్తేయాలనే అభిప్రాయాన్ని మంత్రుల బృందం జీఎస్‌టీ కౌన్సిల్‌ ముందు ఉంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement