Friday, May 3, 2024

Delhi : భారత్ కూటమి మహార్యాలీ..ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ‌ ఇండియా అలయన్స్ మెగా ర్యాలీ నిర్వహించ‌నుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ మెగా ర్యాలీ ద్వారా సత్తా చాటేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఈ మెగా ర్యాలీ చేపడుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా దాదాపు 28 పార్టీల సీనియర్ నేతలు ఇందులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. విపక్షాలు ఈ మెగా ర్యాలీలో ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల జప్తు వంటి అనేక అంశాలను ప్రస్తావించనున్నారు.

- Advertisement -

ఈ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ , సోనియా గాంధీ , శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, భగవంత్ మాన్, చంపాయ్ సోరెన్, మమతా బెనర్జీ ప్రతినిధులు పాల్గొంటారని ఆప్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. డీఎంకే ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా, వామపక్షాల ప్రముఖ నేతలు కూడా హాజరుకానున్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా రాంలీలా మైదాన్‌లో జరగనున్న ఇండియా అలయన్స్ ర్యాలీలో పాల్గొనున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సునీత బహిరంగంగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులురాంలీలా మైదాన్‌లోని ప్రతి గేటు వద్ద తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా పరిసర ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను మోహరించారు. దీంతోపాటు ఆదివారం ఉదయం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ సమస్యను నివారించడానికి వాహనదారులు రాంలీలా మైదాన్‌ వైపు రావొద్దని ఢిల్లీ పోలీసులు సూచనలు జారీచేశారు. ర్యాలీకి అనుమతి ఉందని, అయినప్పటికీ డీడీయూ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రాంలీలా మైదాన్ నుంచి ఎలాంటి పాదయాత్రకు అనుమతి ఇవ్వబోమని అన్నారు. ర్యాలీ కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement