Monday, April 29, 2024

క్రికెట్‌ మ్యాచుల ప్రసార హక్కులకు బీసీసీఐ బిడ్డింగ్‌.. కంపెనీల్లో క‌నిపించ‌ని ఆస‌క్తి

టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచుల ప్రసార హక్కులకు 2023 నుంచి 2028 వరకు ఐదేళ్ల కాలానికి టీమ్‌ఇండియా హోమ్‌ గేమ్స్‌ కోసం బీసీసీఐ మీడియా హక్కులను వేలం వేయనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలవ్వాల్సింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. టీవీ, డిజిటల్‌ హక్కుల ద్వారా రూ.6500- 7500 కోట్లు బోర్డుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఒక్కో మ్యాచ్‌ కనీస ధరను బోర్డు 25 శాతం మేర తగ్గించడం విచిత్రం..

చివరిసారి బీసీసీఐ వేలం నిర్వహించినప్పుడు రిలయన్స్‌, సోనీ కన్నా స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా ఎక్కువగా బిడ్‌ వేసింది. రూ.6138 కోట్లకు హక్కులను దక్కించుకుంది. అప్పుడు డిజిటల్‌, టీవీ, ఎస్‌డీ, హెచ్‌డీ, ఆరు భాషాలు, ఆసియాకప్‌, ఐసీసీ ఈవెంట్లు ఇలా అన్నీ ఉన్నాయి.

ఈసారి మాత్రం డిస్నీ స్టార్‌, వయాకామ్‌ 18, సోనీ హక్కుల కోసం మళ్లీ పోటీ పడే అవకాశం ఉంది. అయితే మరీ ఎక్కువగా ఖర్చు పెట్టే స్థితిలో లేవు. కాగా, కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపించకపోవడం వల్లే బీసీసీఐ కనీస ధరను తగ్గించిందని తెలిసింది. బిడ్డింగ్‌కు కొన్నే సంస్థలు వస్తుండటం, ప్రకటనల ఆదాయం తగ్గడం, 2023లో ఐపీఎల్‌ ఆదాయం 20-25 శాతం తగ్గడంతో బోర్డు ఆచితూచి అడుగులు వేస్తోంది.

- Advertisement -

రాబోయే ఐదేళ్లలో టీమ్‌ఇండియా 88 మ్యాచులు ఆడనుంది. టీవీ, డిజిటల్‌ కలిసి మొత్తం కనీస ధర రూ.3,960 కోట్లుగా ఉంది. ఒక్కో మ్యాచుకు టీవీకి రూ.20 కోట్లు, డిజిటల్‌ రూ.25 కోట్ల వరకు ఉంటుంది. అయితే బీసీసీఐ రూ.60 కోట్ల వరకు ఆశిస్తోందని తెలిసింది. టీవీ హక్కుల ద్వారా కనీస ధరపై 30-40 శాతం, డిజిటల్‌ హక్కులపై 80-90 శాతం వరకు ప్రీమియం వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు రెండు విభాగాలు కలిపి ఒక్కో మ్యాచుకు రూ.80 కోట్ల వరకు బీసీసీఐకి దక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement