Tuesday, May 21, 2024

అండగా బ్యాంకులు… దండిగా రుణాలు, 36 లక్షల మంది రైతులకు ప్రయోజనం..

వ్యవసాయరుణాలు మంజూరు చేయటంలో ఆచితూచి వ్యవహరించే బ్యాంకులు ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులకు ఆర్ధికంగా అండగా నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న రబీ సీజన్‌ లో ముందుగా ప్రకటించిన రుణ లక్ష్య ప్రణాళికను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నాయి. గత ఏడాది 2020-21 ఆర్ధిక సంవత్సరంలోనే బ్యాంకులు అందించే వ్యవసాయ రుణాల వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండటం, రైతుల నుంచి రుణాల చెల్లింపులు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఈ ఏడాది రుణాల మంజూరును మరింత సులభతరం చేశారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను యూనిట్‌గా చేసుకుని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి రుణాలు మంజూరు చేసే ప్రక్ర్రియ విజయవంతమైంది. ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 50,87,783 మంది, రబీలో 2021 డిసెంబరు మాసాంతం వరకు 34,90,321 మంది.. గడచిన రెండు నెలల్లో మరో రెండు లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలందుకున్నట్టు అంచనా.

గత ఏడాది రబీలో 38,75,781 మంది రైతులకు బ్యాంకులు రుణాలందించగా ఈ ఏడాది సీజన్‌ ముగిసేలోపు సుమారు 40 లక్షల మంది రైతులు రుణాలందుకునే అవకాశముందని అంచనా. 2020-21 ఖరీప్‌ సీజన్‌లో రూ 75,238 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా రూ.74,154 కోట్ల రుణాలిచ్చారు. రబీలో రూ53,423 కోట్ల రుణ లక్ష్యాన్ని ప్రకటించి అంతకు మించి రూ.72,724 కోట్ల రుణాలను రైతల కందించారు. 2021-22లో ఖరీఫ్‌ రుణ లక్ష్యం రూ 86,981 కోట్లు కాగా రూ.70,531 కోట్లు రుణాలిచ్చారు. రబీలో 61,518 కోట్ల రుణ లక్ష్యాన్ని ప్రకటించిన బ్యాంకులు అధికారిక లెక్కల ప్రకారం 2021 డిసెంబరు వరకు 34,90,321 మందికి 52,659 కోట్ల రుణాలందించారు. రబీ సీజన్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ముందుగా ప్రకటించిన రుణ లక్ష్యం మేరకు ఈ సీజన్‌ లో నూటికి నూరు శాతం రైతులకు రుణాలందే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం. ఖరీఫ్‌లో వ్యవసాయ రుణ ప్రణాళిక లక్ష్యంలో 81 శాతం రుణాలివ్వగా రబీలో నూటికి నూరు శాతం రుణాలిచ్చే అవకాశముందని అంచనా. గత ఏడాది రబీలో లక్ష్యానికి మించి 136 శాతం మేర రుణాలు మంజూరైన నేపథ్యంలో ఈ ఏడాది రబీ సీజన్‌ లో ఆశాజనకంగా రుణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement