Monday, May 6, 2024

Follow up | టెస్టుల్లో బంగ్లా రికార్డు.. అఫ్గానిస్తాన్‌పై 546 రన్స్‌ తేడాతో గెలుపు

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మిర్పూర్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఏకంగా 546 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ 675 పరుగుల తేడాతో (1928లో) విజయం సాధించి అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 562 పరుగుల తేడాతో (1934లో) గెలుపొంది రెండో స్థానంలో ఉంది. ఇంతకు ముందు టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు 2005లో జింబాబ్వేపై సాధించిన 226 పరుగుల గెలుపే అతిపెద్ద విజయం.

- Advertisement -

బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ విషయానికొస్తే, గతంలో స్పిన్నర్లకు స్వర్గధామంగా భావించే పిచ్‌పై బంగ్లా పేసర్లు చెలరేగారు. తస్కిన్‌ నేతృత్వంలోని పేస్‌బౌలింగ్‌ దళం అఫ్గాన్‌ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు 14వికెట్ల పడగొట్టారు. నజ్ముల్‌ హుస్సేన్‌ షాంటో (146) సెంచరీకితోడు మహ్మదుల్లా హసన్‌ (76), ముష్పీకర్‌ రహమ్‌ (47), హసన్‌ మిరాజ్‌ (48) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 382 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్సింగ్స్‌ ప్రారంభించిన అఎn్గానిస్తాన్‌ బంగ్లా బౌలర్ల ధాటికి 146 పరుగులకే కుప్పకూలింది. అప్సర్‌ జాజయ్‌ (36) ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో బంగ్లాదేశ్‌కి 236 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్‌ భారీ స్కోరు చేసింది. నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (124) మరోసారి సెంచరీతో, మోమినుల్‌ హక్‌ (121) కూడా సెంచరీ చేయడంతో 425/4 వద్ద బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే దారుణంగా ఆడింది. పట్టుమని 100 పరుగులు చేయడానికి చెమటోడ్చింది. బంగ్లా బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. తస్కిన్‌ అహ్మద్‌ (4/37), షారిఫుల్‌ ఇస్లాం (3/28) చెలరేగడంతో అఫ్గాన్‌ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్‌ 546 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement