Tuesday, April 16, 2024

ఢిల్లీలో బండి సంజయ్, చేరికలపై కసరత్తు.. పార్టీ పెద్దలతో మంతనాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడ్రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. వేర్వేరు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్న ఆయన, ఒక కమిటీ సమావేశం కోసమే ఢిల్లీకి వచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం ముగిసిన తర్వాత పలువురు పార్టీ పెద్దలతో ఆయన భేటీ అయినట్టుగా తెలిసింది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

ఒకవైపు పార్టీలో చేరికల వ్యవహారం.. మరోవైపు మునుగోడు పోస్టుమార్టం రిపోర్టులను సిద్ధం చేసుకున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు మానసికంగా సిద్ధపడ్డ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ చేరుకుని బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ద్వారా ఆయన బీజేపీ జాతీయ నాయకత్వంతో మంతనాలు సాగిస్తుండగా, బండి సంజయ్ సైతం మర్రి శశిధర్ రెడ్డితో పాటు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల జాబితాను తీసుకొచ్చినట్టు తెలిసింది.

రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తున్న సమయంలో.. బీజేపీలోకి చేరికలను బాహటంగా, అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున చేపట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరికల వ్యవహారం ఏదీ రహస్యం కాదని, చేరికల కోసం ఎలాంటి బేరసారాలు ఉండవని చాటిచెప్పాలని చూస్తోంది. బీజేపీ మీద టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీలో చేరికల అంశాన్నే ఆయుధంగా తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అధిష్టానం చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తోనూ చర్చించినట్టు తెలిసింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా ఇదే అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement