Friday, March 29, 2024

కేంద్ర మంత్రితో ఏపీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర భేటీ.. గిరిజన సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపుపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సహకరించవలసినదిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో భేటీ అయ్యారు. పలు గిరిజన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించి వినతి పత్రాలు సమర్పించారు. గిరిజన, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించాలని రాజన్నదొర కోరారు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుకు, గిరిజన గ్రామాలకు తాగునీటి కల్పనకు నిధుల అవసరాన్ని ఆయన కేంద్రమంత్రికి వివరించారు.

గ్రామీణాభివృద్ధితో పాటు శ్రీశైలం ఏరియాలోని చెంచులు, పోలవరం గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. కేరళలో రబ్బర్ ప్లాంటేషన్ కోసం అనుమతించినట్టు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని కాఫీ ప్లాంటేషన్లకు పనులను విస్తరించాలని మానవ వనరుల శాఖకు సిఫారసు చేయాల్సిందిగా రాజన్న దొర కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. గిరిజన తెగలకు ప్రభుత్వ గృహ పథకాలను వర్తింపజేయాలని అర్జున్ ముండాను కోరారు. గిరిజన సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. వచ్చే ఏడాది రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా రాజన్నదొర ఆహ్వానించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ చూపుతున్న శ్రద్ధను కేంద్రమంత్రి ప్రశంసించారని తెలిపారు. అలాగే తన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement