Sunday, April 28, 2024

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిచెప్పిన – బాహుబ‌లికి ఏడేళ్లు

తెలుగు సినిమాలంటే చిన్న‌చూపు చూసిన వారికి బాహుబ‌లి సినిమా ఒక గుణ‌పాఠాన్ని నేర్పింది. తాము భారీ క‌థా చిత్రాల‌ని తెర‌కి ఎక్కించ‌గ‌ల‌మ‌ని నిరూపించారు స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. అప్ప‌టి వ‌ర‌కు ప‌లు విజ‌యాలు రాజ‌మౌళి ఖాతాలో ఉన్నా..అవి అంత‌గా గుర్తింపు తీసుకురాలేద‌నే చెప్పాలి.. స్టూడెంట్ నెం.1 మూవీ నుంచి ఈగ సినిమా వరకు తొమ్మిది సినిమాలు తీసి అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్.రాజమౌళి వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రభాస్ తో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అప్పటి వ‌ర‌కు టాలీవుడ్ లో వంద కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమానే లేదు. అలాంటిది వందల కోట్ల బడ్జెట్ తో రిస్క్ చేస్తున్నారు, కొంచెం తేడా కొట్టినా భారీ నష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేవలం తెలుగులోనే కాకుండా ..విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది బాహుబ‌లి.

ఇప్పుడు సౌత్ నుంచి ఇన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయన్నా, బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేసే స్థాయికి సౌత్ ఎదిగిందన్నా దానికి బహుబలి సినిమానే కార‌ణ‌మ‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. బాహుబలి రూపంలో బలమైన పునాది పడకపోయి ఉంటే ..ఇప్పుడు ఇంతటి భారీ స్థాయి సినిమాలు వచ్చేవి కావు అనడంలో సందేహ‌మే లేదు. బాహుబలి కోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. భారీ యుద్ధ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. స్టార్ నటులు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇలా ఒకరేంటి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక కీరవాణి తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి . రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం జులై 10, 2015 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాహుబలి:ద బిగినింగ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫస్ట్ పార్ట్ నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో ప్ర‌భాస్ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. దాంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపుని తెచ్చి పెట్టింది బాహుబ‌లి చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement