Monday, April 29, 2024

ఆరా మస్తాన్ సర్వే తప్పులతడక : కేఏ పాల్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం ప్రజల మద్ధతుందన్న అంశంపై ఆరా సంస్థ మస్తాన్ నిర్వహించిన సర్వే పూర్తి తప్పులతడక అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ సర్వేపై విమర్శలు చేశారు. మస్తాన్ సర్వే నివేదికను మీడియా కెమేరాల ముందు చించి పడేశారు. ఇలాంటి తప్పుడు రిపోర్టులు, సర్వేలు చేస్తే జనం తిరగబడతారని కేఏ పాల్ హెచ్చరించారు. ఈ సర్వే నివేదికపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కేఏ పాల్ వెల్లడించారు. మరోవైపు దేశాన్ని, తెలుగు రాష్ట్రాలను రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

భారతదేశం జీడీపీలో నెంబర్ వన్, తెలంగాణ నెంబర్ వన్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, నిజానికి కేసీఆర్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు వంటివేవీ అమలుకావడం లేదని విమర్శించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తనను జైల్లో పెడతారన్న భయంతోనే కేసీఆర్ బీజేపికి నాలుగు సీట్లు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను బ్యాన్ చేయాలంటూ ప్రచారం చేస్తానని కేఏ పాల్ తెలిపారు. ఈ మేరకు దేశంలోని 18 ప్రధాన పార్టీలను కలుస్తానని అన్నారు. మరోవైపు దేశం ఇలాగే కొనసాగితే మరో శ్రీలంకలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement