Saturday, May 18, 2024

ఏపీఎస్‌ ఆర్టీసీ పెరిగిన ఆదాయం.. సంతోషంలో అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: కరోనా మహమ్మారితో కుధేలైన ఏపీఎస్‌ ఆర్టీసీ కొద్ది నెలలుగా ప్రయాణికులతో కళకళలాడుతోంది. గత రెండేళ్లతో పోల్చితే ఈ వేసవిలో ఆర్టీసీ అత్యధిక ఆదాయం నమోదు చేసుకుంది. గత జనవరి నుంచే ప్రయాణికుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 17న ఆర్టీసీ ఒక్క రోజు ఆదాయం రూ.15.40 కోట్లు. అప్పటి నుంచి క్రమేపీ ఆర్టీసీ ఆదాయం పెరుగుతూనే ఉంది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సగటున రోజుకు రూ.15.30 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తోంది. గత ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల వరుస సెలవులు రావడంతో 18వ తేదీన రూ.18.62 కోట్లు, మే 23న రూ.17.91 కోట్లు, తాజాగా సోమవారం రూ.18.33 కోట్లు ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. ఈ నెల 12న తిరుమలకు లక్షకు పైగా భక్తలు రావడంతో సాధారణ ట్రిప్పుల కంటే అదనంగా 2852 ట్రిప్పులు అధికంగా తిప్పారు. దీంతో ఒక్క రోజు తిరుమల ఆదాయం 84శాతం ఓఆర్‌ తో రూ. 1.75 కోట్లు వచ్చింది. ఓ వైపు టిక్కెట్లపై వచ్చే రాబడితో పాటు టిక్కెట్టేతర ఆదాయాలైన కార్గో, పెట్రోల్‌ బంక్‌లు, బస్టాండ్లలో స్టాల్స్‌ తదితర వాణిజ్య కార్యకలాపాల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గత నెలలో డీజిల్‌ సెస్‌ పెంపు ద్వారా ఆర్టీసీ నష్టాలను కొంత వరకు పూడ్చుకోగలిగింది. ఇక తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో డీజిల్‌ సెస్‌ రెండోసారి పెంపు వలన ఏపీ బస్సుల చార్జీలు తక్కువగా ఉండటంతో గత నాలుగు రోజులుగా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది.

ప్రయాణికుల ఆదరణతోనే..

ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించకుండా ఆర్టీసీని ఆదరించడమే సంస్థ ఆదాయం పెరిగేందుకు దోహదపడుతోందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కే.ఎస్‌ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఆదాయం పెంపులో పల్లెవెలుగు, సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సులు ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబడిలో ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌ కేటగిరీ బస్సులు వెనుకబడ్డాయన్నారు. వీటిపై రాబడి పెంపుకు తగిన సూచనలు ఇస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో విద్యా సంస్థలు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నందున విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం తలెత్తకుండా బస్సుల సంఖ్య పెంపు, సమయపాలనపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాబడి పెంపులో విశేష కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement