Monday, April 29, 2024

మరిన్ని పోస్టుల భర్తీకి ఆమోదం.. ఎక్సైజ్‌, అటవీ, ఫైర్‌ సర్వీసుల్లో నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి తీపికబురు చెప్పింది. తొలివిడతగా 30వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతించిన ఆర్ధిక శాఖ బుధవారంనాడు మరో 3334 పోస్టుల నియామకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి వేర్వేరుగా జీవోలను ఆర్ధిక శాఖ వెల్లడించింది. శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80,039 పోస్టుల బర్తీ ప్రక్రియలో భాగంగా గతనెలలో తొలివిడతలో 30వేల 453 పోస్టుల నియామకాలు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ బుధవారంనాడు ఎక్సైజ్‌, అటవీ, అగ్నిమాపక శాఖల్లో 3334 పోస్టుల భర్తీకి అనుమతించింది. మిగిలిన పోస్టుల భర్తీకి కూడా ఆర్ధిక శాఖ అన్ని శాఖల నుంచి వివరాలను కోరుతూ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంమీద నియామక ప్రక్రియను శరవేగంగా పరుగులు పెట్టించేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. త్వరలో మరిన్ని ఖాళీల భర్తీకి అనుమతులు జారీ చేసేలా ఆర్ధిక శాఖ కార్యాచరణ తుదిదశకు చేరింది.

తెలంగాణ స్టేట్‌ బీవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 40 పోస్టులకు భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్‌ శాఖలో 614 పోస్టులకు పచ్చజెండా ఊపగా, ఇందులో మొత్తంగా 614 కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. మరో 137 రెవెన్యూ శాఖ పరిధిలోని ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ కెమికల్‌ ఇంజనీర్లు 8పోస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లు 114(లోకల్‌ క్యాడర్‌), 15 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు (స్టేట్‌ క్యాడర్‌)లో భర్తీకి ఆమోదం తెలిపారు. అటవీ శాఖలో 1668 పోస్టుల భర్తీలో భాగంగా టీఎస్‌పీఎస్సీకి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిమాపక శాఖలో 14 జూనియర్‌ అసిస్టెంట్ల భర్తీకి ఆర్ధిక వాక ఉత్తర్వులు జారీ చేసింది. మరో 861 పోస్టులను ఫైర్‌ శాఖలో భర్తీకి అనుమతించగా, ఇందులో 26 స్టేట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు, 610 ఫైర్‌మెన్‌, 225 డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆయా పోస్టులను భర్తీకి వీలుగా టీఎస్‌పీఎస్సికి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement