Sunday, May 5, 2024

Life Saviour | ప్రాణం కాపాడిన యాపిల్ స్మార్ట్‌ వాచ్‌.. ప‌డిపోగానే 911కు వెళ్లిన కాల్‌..

గుండె వేగం, ఈసీజీలో తేడాను సెన్సార్ల ద్వారా ముందే గుర్తించి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్ మరోసారి ప్రాణదాతగా మారింది. అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ బాధితుడి సమాచారాన్ని ఆటోమేటిక్ గా 911 ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసి అతని ప్రాణం నిలిపింది.

న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్న ఎరిక్ జోలింగర్ గత నెల తన ఆఫీసు నుంచి ఇంటికి సైకిల్‌పై భారీ వర్షంలో బయలుదేరాడు. అయితే.. ఫుట్ పాత్‌పై ఓ వరదనీటితో నిండి ఉన్న గుంతలో సైకిల్ ఇరుక్కోవడంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో అతని ముక్కు, ముఖం, మోకాలికి గాయాలయ్యాయి. అయినా అలాగే సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి చేరుకున్న జోలింగర్.. బాత్రూంలో టబ్‌కు కొట్టుకొని కళ్లు తిరిగి పడిపోయాడు. అయితే.. అదృష్టవశాత్తూ యాపిల్ వాచ్ ధరించడంతో అతను కిందపడిపోయిన విషయాన్ని సెన్సార్లు ప‌సిగ‌ట్టాయి. ఆ వాచ్ లో బిల్ట్ ఇన్ ఫాల్ డిటెక్షన్ ఉంది. ఒకవేళ ఎవరైనా దేనికైనా కొట్టుకొని కిందపడితే వెంటనే అత్యవసర సేవలకు యూజర్ ను కనెక్ట్ చేసే ఏర్పాటు ఈ వాచ్ లో ఉంది.

- Advertisement -

యాపిల్ వాచ్‌కు రుణపడి ఉంటా..

“911 నుంచి చేస్తున్నాం. మీ ఎమర్జెన్సీ ఏంటి?” అని వినిపించడమే ఆ తర్వాత తనకు గుర్తుందని జోలింగర్ చెప్పాడు. ఆ తర్వాత అతను స్థానిక ఆస్పత్రిలో చూపించుకోగా స్కానింగ్ పరీక్షల్లో ఫ్రాక్చర్ల లాంటివి ఏమీ కాలేదని తేలింది. దీంతో అతన్ని డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా జోలింగర్ తన ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్‌ను తెగ మెచ్చుకున్నాడు. “ఒకవేళ వాచ్ నన్నుఅలర్ట్ చేసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో కూడా ఆలోచించలేను. నా యాపిల్ వాచ్‌కు రుణపడి ఉంటా. అది ఎంతో తెలివైన వాచ్. ఇలాంటి పరిస్థితుల గురించి యాపిల్ ముందే ఆలోచిస్తుంది” అని జోలింగర్ చెప్పారు.

స్మార్ట్ వాచ్‌లు ప్రాణదాతలు..

ఎందరో ప్రాణాలు కాపాడటంలో స్మార్ట్ వాచ్‌లు కీలక పాత్ర పోషించాయి. యూకేలో గతేడాది 42 ఏళ్ల హాకీ వేల్స్ సీఈవో పాల్ వాప్ మ్యాన్ గుంటెపోటుకు గురైతే అతని స్మార్ట్ వాచ్ కాపాడింది. స్వాన్ సే ప్రాంతంలోని మోరిస్టన్ లో ఉన్నతన ఇంటి సమీపంలో జాగింగ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో వాప్ మ్యాన్ విలవిల్లాడాడు. అయినా.. ఎలాగోలా తన యాపిల్ వాచ్ సాయంతో భార్యకు ఫోన్ చేయగా ఆమె వెంటనే ఆస్పత్రికి తరలించింది. యూజర్లు ఎవరైనా ఒక నిమిషానికి మించి కదలకుండా ఉంటే యాపిల్ వాచ్ గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్ గా అత్యవసర ఫోన్ కాల్, లొకేషన్ తో కూడిన మెసేజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లకు వెళ్లిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement