Monday, May 6, 2024

Delhi | ఆక్వా కల్చర్‌లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామి.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మనదేశంలో ఆక్వారంగం ఎంతో అభివృద్ధి చెందిందని, గడిచిన 8 ఏళ్లలో గణనీయమైన వృద్ధి సాధించిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర కీలకంగా ఉందని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దేశంలో జరుగుతున్న ఆక్వా ఎగుమతుల్లో 70 శాతం ఏపీ నుంచేనని వెల్లడించారు. 35 వేల కోట్ల ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయని, లక్షల మంది రైతులు దీనిద్వారా లబ్ది పొందుతున్నారని ఆయన వివరించారు. కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ది కోస్టల్‌ అక్వాకల్చర్‌ అథారిటీ (సవరణ) బిల్లు – 2023 చర్చలో శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.

ఇటీవల వియత్నాం, ఇక్విడార్‌లో అక్వా ఉత్పత్తి పెరగటంతో ఆ ప్రభావం మన రాష్ట్ర ఎగుమతులపై పడగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఆసరాగా నిలిచారని శ్రీకృష్ణ తెలిపారు. ఆక్వా రంగంలో ఇన్‌పుట్ సబ్సిడీలు అందించి ఆదుకున్నారని వెల్లడించారు. ఆక్వా రంగంలో మరింత అభివృద్ధి సాధించాలంటే సాంకేతికను వాడుకోవాలని, సరికొత్త విధివిధానాలను అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. పీఎం మత్స్య సంపద యోజన ఆక్వా రైతులను ఆదుకునే మంచి పథకమని ఆయన అబిప్రాయపడ్డారు.

ఈ పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఆరు వేల కోట్లకు పెరగటం హర్హణీయమన్నారు. అలాగే మనదేశంలో ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని, తీర ప్రాంత రాష్ట్రాల్లో ప్రతి 3 నియోజక వర్గాలకు ఒక టెస్టింగ్‌ ల్యాబ్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోస్టల్‌ ఆక్వా అథారిటీలో 11 మంది సభ్యులుండగా, ఇందులో నలుగురు మాత్రమే తీరప్రాంత రాష్ట్రాల వారున్నారని శ్రీకృష్ణ చెప్పారు. దేశంలో ఉన్న 9 తీర ప్రాంత రాష్ట్రాల వారిని నియమిస్తే ఆక్వా రంగంలో మరింత అభివృద్ధి సాధించవచ్చన్నారు. అలాగే హ్యాచరీస్ రైతులకు కూడా సలహాలు, సూచనలు ఇచ్చే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో యాంటీబయటిక్స్‌ వాడకంపై రైతులకు సరైన అవగాహన ఉండటం లేదని ఆయన అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement