Thursday, May 2, 2024

రాష్ట్రంలో అరాచక పాలన, పార్లమెంటులో లేవనెత్తుతాం.. టీడీపీపీ సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన గురించి పార్లమెంటులో లేవనెత్తాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించినట్టు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం గం. 2.00 సమయంలో పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నివాసంలో పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని శ్రీనివాస్ (నాని), కె. రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (నేషనల్ కోఆర్డినేషన్) కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు సమావేశ వివరాలను మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించాయని కనకమేడల అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అకృత్యాల గురించి దేశ ప్రజలందరికీ తెలిసేలా పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని, పాలకవర్గం నేతలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటి గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు: రామ్మోహన్ నాయుడు

- Advertisement -

తెలుగు ప్రజల సమస్యల గురించి తెలుగుదేశం పార్టీ గొంతెత్తుతోందని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా సీఎం జగన్ ప్రశ్నించేవారి గొంతు నొక్కేస్తున్నారని టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము పార్లమెంట్ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నందున జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయకుండా అక్రమ మైనింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం వైస్సార్సీపీ చేస్తున్న పోరాటం సంగతేంటో ఆ పార్టీ అధినేత చెప్పాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఎటు పోయిందో చెప్పాలన్నారు.

FRBM పరిమితులు దాటి రుణాలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్న ఆయన, వీటన్నింటి గురించి పార్లమెంటులో చర్చతో పాటు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాజీనామాలు చేయడానికి తాము వెనుకాడటం లేదని, రాష్ట్రం కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజీనామా డిమాండ్ చేసిన జగన్ కనీసం జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావాలున్న పార్టీ అన్న రామ్మోహన్, దేశం కోసం ఎప్పుడు ఏ సూచన చేయాల్సి వచ్చినా ముందుంటుందని తేల్చి చెప్పారు. అందుకే జీ20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చారని ఆయన చెప్పారు.

హోదా కోసం రాజీనామాకు సిద్ధం : ఎంపీ రఘురామకృష్ణరాజు

మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు చంద్రబాబును, ఎంపీలను నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు కలిశారు. వారితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ గతంలో పార్లమెంట్ ఆఖరి రోజు అందరూ రాజీనామాలు చేసి విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేద్దామన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకూ సిద్ధంగా ఉన్నానన్న రఘురామ, ముగ్గురు టీడీపీ ఎంపీలను రాజీనామా కోసం ఒప్పించడానికి వచ్చానని తెలిపారు. టీడీపీపీ సమావేశం జరుగుతుండడం వల్ల విషయం చెప్పి బయటకు వచ్చానని ఆయన చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement