Monday, April 29, 2024

కృష్ణా జల వివాదాలకు ముగింపు.. 6న కృష్ణా బోర్డు కీలక సమావేశం

అమరావతి, ఆంధ్రప్రభ : రిజర్వాయర్స్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ (జలాశయాల నిర్వహణ కమిటీ – ఆర్‌ఎంసీ) ఆమోదించిన తీర్మానాలను అమోదించి కార్యాచరణ చేపట్టేందుకు కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌ఎంసీ తీర్మానాల ఆమోదమే అజెండాగా జవవరి 6న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎం.పీ సింగ్‌ లేఖ రాశారు. కృష్ణా జలాల్లో వాటాలు, హక్కులు, వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఈ ఏడాది మే 10న కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీనీ ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్‌ పిళ్ళై అధ్యక్షతన ఏర్పాటయిన కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ)లు, జెన్‌ కో డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. ఒక వైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, మరో వైపు మధ్యవర్తిగా కృష్ణా బోర్డు..త్రిసభ్య కమిటీగా ఏర్పాటయిన ఆర్‌ఎంసీలో తీసుకున్న నిర్ణయాలను కార్యాచరణకు తీసుకొచ్చి వివాదాలకు ముగింపు పలకాలని నిర్ణయించారు. కార్యాచరణ మాత్రం ముందుకు సాగలేదు. ఆర్‌ఎంసీ సమావేశాలను ఇప్పటివరకు ఆరుసార్లు ఏర్పాటు చేసినా సభ్యుల గైర్హాజరు, ఏకాభిప్రాయం సాద్యం కానందున నిర్దిష్టమైన నిర్ణయాలకు అవకాశం లేకుండా పోయింది.

ఎట్టకేలకు ఈనెల 3న నిర్వహించిన సమావేశానికి రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టులో నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఏకాభిప్రాయం కుదిరిందనీ, నాగార్జున సాగర్‌ జలాశయం సమస్యలపై మరోసారి భేటీ కావాల్సి ఉందని రెండు రాష్ట్రాల అధికారులతో పాటు ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్ళై ప్రకటించారు. ఈ విషయంలో తెలంగాణ ఆ తరువాత మాట మార్చింది. తీర్మానాలపై సంతకాలు చేసేందుకు ఈనెల 5న ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఆర్‌ఎంసీ నిర్ణయాలు తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉన్నందున అంగీకరించటం లేదని కృష్ణా బోర్డు చైర్మన్‌ కు లేఖ రాయటమే కాకుండా తీర్మానాల అమలు కోసం రూపొందించిన నివేదికపై సంతక చేసేందుకు తెలంగాణ నిరాకరించింది. దీంతో ఆర్‌ఎంసీ కన్వీనర్‌ తో పిళ్ళై, బోర్డు సభ్యుడు మౌతాంగ్‌తో పాటు ఏపీ జలవనరుల శాఖ అధికారులు తీర్మానాల అమలు నివేదికపై సంతకాలు చేశారు.

ఆర్‌ఎంసీ ఆమోదించిన నివేదికను కృష్ణా బోర్డు చైర్మన్‌ కు అందచేశారు. తీర్మానాలపై మెజారిటీ సభ్యులు అంగీకరించి సంతకాలు చేసినందున వాటి అమలు సాంకేతికంగా చెల్లుబాటవుతుందని నిపుణులు చెబుతున్నారు. కృష్ణా బోర్డు కూడా అదే అభిప్రాయంతో ఉన్నా జనవరి 6న సమావేశం నిర్వహించి తెలంగాణను ఒప్పించే ప్రయత్నం చేయనుంది. తెలంగాణ ఇదే వైఖరితో ఉంటే ఆర్‌ఎంసీ తీర్మానాలను ఆమోదిస్తున్నట్టు ప్రకటించి ఆ మేరకు రిజర్వాయర్ల నిర్వహణ అమలుకు శ్రీకారం చుట్టునున్నట్టు సమాచారం.

- Advertisement -

విద్యుదుత్పత్తిపై ఆర్‌ఎంసీ నిబంధనలు

శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి రెండు రాష్ట్రాల మధ్య ప్రధాన వివాదంగా మారింది. ఈనెల 3న నిర్వహించిన ఆర్‌ఎంసీ సమావేశంలో శ్రీశైలంలో 50:50 జలవిద్యుత్పత్తికి అంగీకరించిన తెలంగాణ రెండు రోజుల్లోనే మాట మార్చి పేచీ పెట్టింది. ప్రతి ఏటా జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు నిర్దారించటంపైనా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ సమయంలో 854 అడుగుల లోపు నీటి మట్టం నుంచి జలవిద్యుదుత్పత్తి చేయకూడదని ఆర్‌ఎంసీ తీర్మానించింది. మిగత రోజుల్లోనూ 815 అడుగులకు దిగువన విద్యుదుత్పత్తి కోసం నీటిని తీసుకోకూడదు. అంతేకాదు..దిగువ ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది.

ఈ మేరకు రెండు రాష్ట్రాల పవర్‌ హౌస్‌ ను పర్యవేక్షణ కోసం పర్మినెంట్‌ స్టాండింగ్‌ కమిటీ (పీఎస్‌ పీ) ఏర్పాటవుతుంది. జలవిద్యుదుత్పత్తి విషయంలో ఆర్‌ఎంసీ భేటీలో తీసుకున్న నిర్ణయాలనేకం ఎప్పటినుంచో ఏపీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్నవి కావటం విశేషం. అనేక సందర్భాల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కూడా ఏపీ వాదనలు సహేతుకంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కోసం కేటాయించే జలాల్లో 64 శాతం తమకు దక్కాల్సి ఉందని ఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణ మాత్రం తమకు 76 శాతం వాటా కావాలని డిమాండ్‌ చేస్తోంది.

కృష్ణాలో ఏపీ వాటా 512 టీఎంసీలు

కృష్ణాలో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కూడా ఆర్‌ఎంసీలో స్పష్టత వచ్చింది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులను ప్రామాణికంగా తీసుకుని ఏపీకి 512, తెలంగాణకు 299 టీ-ఎంసీలనుల కృష్ణా బోర్డు కేటాయించింది. దీని ఆధారంగానే కృష్ణాలో ప్రధాన ప్రాజెక్టులయిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి ఆయా రాష్ట్రాల్ర ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియామవళి(రూల్‌ కర్వ్స్‌)ని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. రూల్‌ కర్వ్స్‌ కు ఏపీ ఆమోదం తెలపగా తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాలను ఏపీ బేసిన్‌ అవతల ప్రాజెక్టులకు తరలిస్తోందనీ, శ్రీశైలంలో వాటాకి మించి వాడుకుంటూ అనుమతి లేని ప్రాజెక్టుల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా కృష్ణాలో 50:50 శాతం కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చెన్నైకి తాగునీరు,. ఎస్సార్బీసీ, తెలుగు గంగ, గాలేరు-నగరిల కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 114 టీ-ఎంసీలను బచావత్‌ ట్రైబ్యునల్‌ తో పాటు విభజన చట్టం ద్వారా ఏపీకీ కేటాయింపులున్నాయనీ, ఆ మేరకు తాము శ్రీశైలం నుంచి నీటిని వినియోగించుకోవాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement