Sunday, April 28, 2024

Amarnath Yatra | జూన్ 29నుంచి అమర్‌నాథ్ యాత్ర.. రేప‌టినుంచే రిజిస్ట్రేషన్లు

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీన అష్టమి తిథి మధ్యాహ్నం 02.19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 అంటే రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు.

కాగా, అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధమైన శివ లింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. హిమ రూపంలో ఉన్న పరమ శివుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హర హర మహదేవ అంటూ అమర్‌నాథ్‌కు వెళతారు.

ఇక, ఆగస్టు 19తో ఈ యాత్ర ముగియనుంది. కాగా, ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి. ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళలు యాత్రకు వెళ్లకూడదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement