Sunday, May 5, 2024

వరి నాట్లెలా..? నైరుతి ప్రవేశించినా ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించినస్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో ఈ ఏడాది వానాకాలం వరి సాగుపై క్రమంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి లక్ష్యం మేరకు నాటు పడుతుందన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు పడగానే పొలం దున్ని నాటేసేందుకు రైతులు ఇప్పటికే వరినారు పోశారు. నారు పోసి దాదాపు 20రోజులు దాటిపోతోంది. మరో పది రోజులు గడిస్తే నెల నారు అవుతుందని, ఈ లోగా నాటు వేయాలని, లేకపోతే దిగుబడి రాదని రైతులు వాపోతున్నారు. అయితే ఓ పక్కన వరి నారు ఎదుగుతున్నా వర్షాలు కురవకపోవడంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందలేదు.

భూమి తడిసేంత వర్షాలు పడకపోవడంతో వరినాట్ల కోసం బురదపొలం దున్నకం సాధ్యం కావడం లేదు. బావి, బోరులోని నీటితో దున్నకానికి పూనుకుంటే ఎకరా తడవాల్సిన చోట కనీసం పావు ఎకరం మడి కూడా తడవని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది వానాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్‌ 21న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని 32 గ్రామీణ జిల్లాల్లో దాదాపు 19 జిల్లాల్లో సాధారణ సగటు వర్షపాతం నమోదు కాకపోవడం చూస్తుంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్‌ మూడు, నాలుగోవారంలోనూ 19 జిల్లాల్లో 80శాతానికి పైగా వర్షపాతంలో లోటు నమోదైంది. మరో పది రోజుల్లోగా భూమి తడేసంత, భూగర్భ జలాలు వృద్ధి చెందేంత వానలు కురవకపోతే వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఈ ఏడాది 65లక్షల ఎకరాల్లో వరిసాగు అవుంతని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమవడం, ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో కురవని పరిస్థితుల్లో లక్ష్యం మేరకు వరిసాగు అయ్యే పరిస్థితులు క్రమ క్రమంగా మృగ్యమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. చాలా జిల్లాల్లో భూమి పై పొరల్లో మాత్రమే కొద్దిపాటి తేమ ఉందని, ఎండలకు అదికూడా ఆవిరైపోతోందని రైతులు వాపోతున్నారు. గతేడాది ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగుకు అనుకూలంగా వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు గోదావరికి వరదలు వచ్చాయి. ప్రస్తుతం నైరుతి ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వరినాట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.

సాధారణంగా జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 12.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటికీ కనీసం 4.5శాతం మాత్రమే వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురవడంతో ఇదే సమయానికి బురద పొలంతో అన్ని జిల్లాల్లో వరినాట్లకు రైతులు సిద్ధమయ్యారు. ఈ వానాకాలంలో రుతుపవనాల కాలంలో జూన్‌లో సాధారణ వర్షపాతం 71.7 మిల్లిdమీటర్లు కురవాల్సి ఉన్నా 14.5 మి.మీ మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు కేవలం వికారాబాద్‌ జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 31 గ్రామీణ జిల్లాల్లో నారాయణపేట, రాజన్నసిరిసిల్ల తదితర జిల్లాల్లో 25శాతం నుంచి 96శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ అందించిన గణాంకాల ప్రకారం తెలంగాణలోని మొత్తం 612 మండలాల్లో కేవలం 45 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement