Sunday, April 28, 2024

విమాన ప్రయాణం, మరింత ప్రియం.. 5 శాతం పెరిగిన జెట్‌ ఫ్యూయెల్‌ ధర

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ప్రతీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. అయితే విమాన ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఈ వార్త కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. జెట్‌ ఫ్యూయెల్‌, ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు జెట్‌ ఇంధనం ధరలను కిలో లీటర్‌కు 5 శాతం పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సోమవారం జెట్‌ ఇంధనం ధరలను కిలో లీటర్‌కు రూ.6,188 పెంచింది. ఏటీఎఫ్‌ ధరలు పెరగడం ఇది వరుసగా 10వసారి. సోమవారం ఢిల్లిలో ఎయిర్‌ టర్బైన్‌ ఇంధనం ధర కిలో లీటర్‌కు రూ.1,16,852 నుంచి రూ.1,23,039.71కు పెరిగింది. కోల్‌కతాలో రూ.1,27,854.60, ముంబైలో రూ.1,21,847.11, చెన్నైలో కిలో లీటర్‌ రూ.1,27,286.13కు పెరిగింది.

విమానయాన సంస్థలపై భారం..

జెట్‌ ఇంధనం ధరలు పెరుగుదల కారణంగా విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఇంధన ధరల పెరుగుదల కారణంగా విమాన ప్రయాణం కూడా మరింత ప్రియం కానుంది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంధనం విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధర అధికంగా ఉండటంతో ఈ ఏడాది ఏటీఎఫ్‌ ధరలు పెరగడం ఇది పదోసారి. ఇంధన ధరలు పెరగడంతో.. విమాన టికెట్‌ ధర పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది జెట్‌ ఇంధన ధరలు 61.7 శాతం పెరిగాయి. జనవరి 1, 2022 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌కు రూ.46,938 పెరిగింది. జనవరి 1 నుంచి జెట్‌ ఇంధనం కిలో లీటర్‌కు రూ.76,062 నుంచి రూ.1.23 లక్షలకు పెరిగింది. జెట్‌ ఇంధనం ధర నెలలో రెండు సార్లు పెరిగింది. నెలలో 1వ, 16వ తేదీల్లో విమానాల ధరలు మారుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement