Monday, December 2, 2024

Big story | అమెరికా, చైనా తర్వాత మనమే! అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : ప్రధాని నరేంద్రమోడి ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా తాము వరుసగా మూడోసారి అధికారంలో కొస్తే ఐదేళ్ళలోగా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందంటూ స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. వరల్డ్‌ బ్యాంక్‌ అంచనాలు కూడా మోడి ఆశాభావానికి అనుగుణంగానే వెల్లడౌతున్నాయి. ప్రస్తుతం భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉంది. మన ముందు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలున్నాయి.

గతేడాది వరకు భారత్‌ ఆరోస్థానంలో ఉండగా అప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను వెనక్కినెట్టి ఆ స్థానంలోకి భారత్‌ చేరింది. 2014లో ఎన్‌డీఏ అధికారం చేపట్టేనాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ పదోస్థానంలో ఉండేది. కోవిడ్‌ అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు వేగంగా మారాయి. దీనికి తోడు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సరుకుల రవాణాకు ప్రతిబంధకంగా మారింది. ఇది వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది.

- Advertisement -

కోవిడ్‌, రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచంపై దాదాపు దశాబ్దంపాటు కొనసాగే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. అయితే భారత్‌ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న స్వయం సమృద్ధి ఆర్థిక విధానాల ప్రభావం భారత్‌ను ఈ ముప్పు నుంచి తప్పించాయి. రెండేళ్ళు మినహా భారత్‌ వృద్ధి నమోదులో పెద్దగా వెనకబడలేదు. అదే సమయంలో మనకంటే ముందున్న జర్మనీ, జపాన్‌ల ఆర్థిక వ్యవస్థలు మందగించాయి. 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ 7.2శాతం వృద్ధి నమోదు చేసింది. 2023-24లో ఇది ఆరు నుంచి 6.5శాతముంటుందని అంచనాలేస్తున్నారు. రానున్న కాలంలో కూడా ఈ వృద్ధి ఆరుశాతానికి పైబడే ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ సంస్థ ధ్రువీకరించింది.

బెంగళూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ యూనివర్శిటీ కూడా రాబోయే ఏళ్ళలో భారత్‌ ఏడు శాతం స్థూల జాతీయోత్పత్తిలో అభివృద్ధినమోదు చేస్తుందని విశ్లేషించింది. 2023చివరి నాటికి భారత్‌ 3.7ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అప్పటికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌పై భారత్‌ తన ఆధిక్యతను కొనసాగిస్తూనే ఉంటుంది. ఇంటర్నేషనల్‌ మోనిటరీ ఫండ్‌ అంచనాల మేరకు 2025నాటికి భారత్‌ జర్మనీ ఆర్థిక వ్యవస్థను దాటేస్తుంది. 2027నాటికి 5.4ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది. జపాన్‌ ఆర్థిక వ్యవస్థను మించిపోతుంది.

ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుంది. డాలర్‌ మారకపు విలువ మార్పులతో సంబంధంలేకుండా 2027వరకు భారత్‌ 6.5నుంచి 7శాతం వృద్ధి నమోదు చేస్తుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎకోవ్రాప్‌ తాజా నివేదిక స్పష్టం చేసింది. భారత్‌ వృద్ధి నమోదు చేయడంతో పాటు రానున్న కాలంలో జర్మనీ, జపాన్‌ల వృద్ధిలో తరుగుదల కూడా ఇందుకు కారణం కానున్నాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ అంచనా మేరకు 2023-24లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3శాతం క్షీణతను నమోదు చేస్తుంది. 2024-25లో తిరిగి 1.3శాతం వృద్ధి సాధిస్తుంది. ఇక జపాన్‌ 2023-24లో 1.4శాతం వృద్ధి నమోదు చేస్తుంది.

2024-25లో జపాన్‌లో ఆర్థిక వృద్ధి ఒక శాతానికి పరిమితమౌతుంది. వీటన్నింటితో పాటు భారత్‌కున్న రుణాలు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీలు కూడా భారత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి దోహదపడుతున్నాయి. భారత స్థూల జాతీయోత్పత్తి విలువపై 170శాతం విలువైన రుణాలు భారత్‌కున్నాయి. అదే జపాన్‌ స్థూల జాతీయోత్పత్తి కంటే 400శాతం అధిక రుణాల్ని కలిగుంది. చైనా 300శాతం రుణంతో ఉండగా జర్మనీ 170శాతం రుణాన్ని కలిగుంది.

ప్రపం చవ్యాప్తంగా ఉత్పాదకతను పెంచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగంలోకి తెచ్చారు. ఈ కృత్రిమ మేథను భారత్‌ కూడా తన ఉత్పాదక రంగంలో ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ కృత్రిమ మేథ కారణంగా ఒక్క సాంకేతిక అంశాన్ని పరిశ్రమలకు జత చేస్తోంది. అంతే తప్ప ఉపాధి అవకాశాలకు కొరత రానివ్వడంలేదు. అలాగే బడ్జెట్‌లో శ్రామిక శక్తికి శిక్షణ పెంపొందించేందుకు తగిన కేటాయింపులు జరపడం కూడా ఉత్పాదకత పెంపునకు దారితీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement