Wednesday, May 1, 2024

క‌ట్నం వేధింపుల కేసులో న‌టి అభిన‌య‌కి.. రెండేళ్లు జైలు శిక్ష‌

క‌ట్నం వేధింపుల కేసులో క‌న్న‌డ సీనియ‌ర్ న‌టి అభిన‌య‌కి రెండు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డింది. ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు మూడేళ్లు, ఆమె తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్లు శిక్షను విధిస్తూ జడ్జి జస్టిస్‌ హెచ్‌బీ ప్రభాకర్‌శాస్త్రి తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పుపట్ల లక్ష్మీదేవి సంతోషం వ్యక్తం చేశారు. నటి అభినయ సోదరుడు శ్రీనివాస్‌ 1998లో లక్ష్మీదేవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో లక్ష్మీదేవి నుంచి శ్రీనివాస్‌ కట్న కానుకల కింద రూ.80వేలు డబ్బు, కొంత బంగారం తీసుకున్నాడు.

కాగా, వివాహం అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని శ్రీనివాస్‌ కుటుంబం బాధిత మహిళను డిమాండ్‌ చేశారు. దీంతో విసుగు చెందిన లక్ష్మీదేవి 2002లో భర్త, అత్తమామలు సహా అభినయపై బెంగళూరు చంద్ర లేఔట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రూ. లక్ష తీసుకురావాలని నటి అభినయ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణలో భాగంగా.. నేరం రుజువైనట్లు హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు అభినయకు రెండేళ్ల కారాగార శిక్షను ఖరారు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement