Friday, May 10, 2024

రుణమాఫీ వేగవంతం.. వచ్చే నెల రెండో వారానికి పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే నెల రెండో వారంలోపు రుణమాఫీ చెల్లింపులు పూర్తి చేసేలా సర్కార్‌ వేగం పెంచింది. అన్నదాతలకు బ్యాంక్‌ అప్పులను చెల్లించేందుకు సర్కారు అమలు చేస్తోన్న రుణమాఫీ ప్రక్రియ వేగవంతం కానుంది. పన్నేతర ఆదాయం ఖజానాకు సమకూరుతున్న నేపథ్యంలో చెల్లింపుల ప్రక్రియ ఊపందుకోనుంది. వచ్చే నెల రెండో వారం వరకు మొత్తం రుణమాఫీ చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

తెలంగాణ సర్కార్‌ ఇటీవలే రైతులకు తీపి కబురు అందించింది. పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా పంట రుణాల మాఫీ ప్రక్రియను పున:ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకపై వారానికి కొంత మొత్తం చొప్పున నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 3న రూ.18,241 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ విడుదల చేసింది. అదే రోజు రూ.37 వేలనుంచి రూ 41 వేల మధ్య ఉన్న రుణాలున్న 62,758 మంది రైతులకు మాఫీ చేస్తూ రూ.237.85 కోట్లు జమ చేసింది.

- Advertisement -

రెండో విడతలో 5,86,270 మందికి రూ.1374.96 కోట్లు మాఫీ అయ్యాయి. ఇంకా 25.98 లక్షల మంది రైతులకు రూ.18,004 కోట్లు అందాల్సి ఉంది. వీటిని ఈ నెల నుంచి వచ్చే నెల రెండో వారం వరకు అయిదు విడతల్లో విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు రూ.41 వేల వరకు రుణం ఉన్న వారికి చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన వారిని అయిదు కేటగిరీలుగా చేసి ప్రతి వారం నిధులు జమ చేయనున్నారు. మొత్తానికి సెప్టెంబరు 15 నాటికి రూ.లక్ష వరకు మాఫీ చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆర్థికశాఖకు నిర్దేశించింది.

రూ.19వేల కోట్లు..

అధికారుల అంచనా ప్రకారం సుమారు రూ.19వేల కోట్లు రుణమాఫీ పథకానికి అవసరం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకుల వారీగా ప్రాథమిక జాబితాలు తెప్పించుకున్న ఆర్థికశాఖ సంబంధిత గణాంకాల జాబితాను సిద్ధంచేసి సీఎం కార్యాలయాలనికి పంపించింది. 2018 ఎన్నికల ముందు చేసిన ప్రకటన మేరకు అదే ఏడాది డిసెంబర్‌ 11 నాటికి ఆయా జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో పంట రుణాలు పొంది ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఆ తర్వాత రుణాలు తీసుకున్న వారికి ఉపశమన పథకం అమలు కాదు.

20 శాతం లబ్ధిదారులు రీషెడ్యూల్‌

లబ్ధిదారుల్లో దాదాపు 20శాతం అప్పులను తీర్చేశారు. అయినప్పటికీ జాబితాలో వారికి స్థానం కల్పిస్తూ ప్రభుత్వం రుణ ఉపశమన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల తర్వాత సుమారు రూ.16,680 కోట్ల మొత్తాన్ని నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లించి రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న కేసీఆర్‌ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబద్ధతను చాటుకునేందుకు నిర్ణయించారు.

ఇకపై రుణమాఫీకి స్వస్థి…?

రుణమాఫీతో ఆర్ధిక లోటు తలెత్తుతోంది. అయినా దేశంలోని అనేక రాష్ట్రాల తీరు మారడంలేదు. తమ తొలి ప్రాధాన్యత రైతాంగ సంక్షేమానికేనని పలు రాష్ట్రాలు ఇదే దారిలో నడుస్తున్నాయి. 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల తెగువనుచూసిన దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ తీరును అందిపుచ్చుకుంటున్నాయి. ఆర్ధిక భారమైనా రైతును ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా జీఎస్‌డీపిలో 0.6 శాతం మేర, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 0.5 శాతం మేర రుణమాఫీ మొత్తంతో ఆర్ధిక లోటు జీఎస్‌డీపిలో ఈ మొత్తంగా ఉన్నట్లు అంచనా.

ఇప్పటికే ఆర్ధిక లోటుతో ఇబ్బందులు పడుతున్న ఇరు తెలుగు రాష్ట్రాలలో రుణమాఫీ మరింత సమస్యగా మారుతోంది. ఇక అత్యధిక ఆర్ధికలోటు ఉన్న పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లోనూ రుణమాఫీ భారీ భారంగానే మారుతున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక లోటు రూ. 27,749కోట్లుగా బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే రుణమాఫీ అంశం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు గుదిబండగా మారుతూనే ఉన్నది.

దేశంలో అనేక రాష్ట్రాలు ఇలా రుణమాఫీని ప్రకటిస్తున్నాయి. 2014కు పూర్వం కేంద్ర ప్రభుత్వాలే రుణమాఫీ ప్రకటించే ఆనవాయితీ ఉండగా, 2014 ఎన్నికల్లో తొలిసారిగా కేసీఆర్‌, చంద్రబాబు నాయుడులు ఇరు రాష్ట్రాల్లోనూ రుణమాఫీకి నడుం బిగించారు. ఆ తర్వాత ఇదే దారిలో 8 రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో రూ. 1.77లక్షల కోట్ల రైతు రుణాలకు చెందిన నగదును బ్యాంకుల్లో జమ చేయగా, మరో రూ. 67,991 కోట్లను చెల్లించేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వాలు కూడా…

వీపీ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో రూ. 10వేలు, 2008లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో రూ. 1లక్షల వరకు కేంద్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేశాయి. అయితే రాష్ట్ర బడ్జెట్‌లు స్వల్ప మొత్తాలతో ఉన్న కారణంగా 2014కు ముందు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సాహసం చేయలేదు. అయితే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత ఏపీ, తెలంగాణలో నాలుగు విడతల్లో రుణమాఫీ చేశారు. ఇది దేశంలోనే సంచలనంగా మారి తీవ్ర చర్చకు దారితీసింది. రైతు రుణ మొత్తంతో సంబంధం లేకుండా రూ. లక్ష వరకు తెలంగాణ ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేయగా, రూ. 50వేల వరకు ఒకే మొత్తంలో, రూ. 1.50లక్షల రుణమొత్తాలను అయిదు విడతల్లో మాఫీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానాలను తెలుగు రాష్ట్రాలు అమలు చేయడం చూసి తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, కర్నాటక, పంజాబ్‌లు అనుసరించాయి.

వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రుణమాఫీ వివరాలు…

రాష్ట్రం సంవత్సరం రుణమాఫీ(రూ కోట్లలో…)
ఏపీ 2014- 15 24,000
తెలంగాణ 2014- 15 19,000
తమిళనాడు 2016- 17 6.041
యూపీ 2017- 18 36,000
మహారాష్ట్ర 2017- 18 34,000
పంజాబ్‌ 2017- 18 10,000
కర్నాటక 2017- 18 42,000
రాజస్థాన్‌ 2018- 19 8,000

Advertisement

తాజా వార్తలు

Advertisement