Friday, May 3, 2024

60 సెకన్లు 700 చలాన్ల చెల్లింపులు.. పెండింగ్ చలాన్‌లపై రాయితీకి విశేష స్పందన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వాహనాలపై పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు క్లియరెన్స్‌ ప్రకటించడంతో బకాయిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు రాయితీపై చలానాల బకాయిలను చెల్లించేందుకు వీలు కల్పించినప్పటికీతొలిరోజే వాహనదారులు భారీ ఎత్తున స్పందించారు. నిమిషానికి 700 చలాన్లను అధికారులు క్లియర్‌ చేశారు. టూ వీలర్‌, త్రీ వీలర్‌లపై ఉన్న చలానాలకు 75 శాతం రాయితీ ప్రకటించగా, కారు, లారీ, భారీ వాహనాలపై ఉన్న చలానాలకు 50 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మాస్క్‌ చెల్లింపులపై 90 శాతం రాయితీని కల్పించడంతో బకాయిదారులందరూ పెద్ద ఎత్తున తమ చలానాలను క్లియర్‌ చేసుకుంటున్నారు. నాలుగేళ్ళుగా మూడు కమిషనరేట్ల పరిధిలో 6.19 కోట్ల ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ చలానాలను క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన పోలీసులు చెల్లింపులన్నింటినీ ఆన్‌లైన్‌ ద్వారానే చేసేందుకు అనుమతించారు. దీంతో తొలిరోజే లక్షలాది మంది ఈ ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్‌ల వెబ్‌సైట్‌ను చూసి బకాయిలు ఎన్నున్నాయి, ఎంత డబ్బు చెల్లించాలన్న అంశాన్ని పరిశీలించారు.

రోజూ కనీసం మూడు లక్షల మంది చలానాలను చెల్లించే అవకాశాలున్నాయన్న ఉద్దేశ్యంతో అధికారులు సర్వర్‌ను సిద్దం చేశారు. సాధారణ సర్వర్‌ స్థాయిని దాదాపు 10 రెట్లు పెంచారు. అయితే అధికారుల అంచనాలకు మించి వాహనదారులు వెబ్‌సైట్‌ను చూశారు. ప్రతి వాహనదారు కనీసం అర నిమిషం ఆలోచించాలన్న భావనతో జరిమానా చెల్లించే సమయంలో వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పాటు ఇంజన్‌ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు కూడా నమోదు చేయాలన్న ఐచ్ఛికాన్ని ఉంచారు.

కుప్పకూలిన సర్వర్‌..

ఒకటికి పది సార్లు ఆలోచించి అధికారులు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సర్వర్‌ కుప్పకూలింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది వెబ్‌సైట్‌ను చూడటంతో సర్వర్‌ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తడంతో రెండు రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇచ్చి మరింత సామర్థ్యం పెంచాక అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, రాయితీలపై చలానాల చెల్లింపునకు గడువు ఇంకా 30 రోజులు ఉందని అధికారులు వెబ్‌సైట్‌లో తెలియజేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement