Tuesday, April 30, 2024

Africa : లిబియాలో మునిగిన ప‌డ‌వ‌…61మంది మృతి

ఆఫ్రికా దేశం లిబియాలో మరో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో పడవ మునిగిపోవడంతో 61 మంది వలసదారులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు.

ప్రమాద సమయంలో పడవలో 86 మంది ఉన్నారు. లిబియాలోని జ్వారా నగరం నుంచి బయలుదేరిన పడవ..మధ్యధరా సముద్రాన్ని దాటుతుండగా మునిగిపోయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. 61 మంది చనిపోగా.. 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

మధ్యప్రాచ్య దేశాలతో పాటు ఆఫ్రికా నుంచి సముద్రం ద్వారా యూరప్ చేరుకోవాలంటే.. లిబియానే ప్రధాన కేంద్రం. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాల ప్రజలు అక్కడ జరుగుతున్న యుద్ధం, అశాంతి నుండి తప్పించుకోవడానికి లిబియా మీదుగా అక్రమంగా యూరప్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా మధ్యధరా మీదుగా యూరప్‌లోకి వెళ్తుంటాయి. అందువల్ల లిబియా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా నిత్యం ఎంతో మంది ప్రయాణం సాగిస్తుంటారు.

పడవలో పరిమితికి మించి జనాలు ఎక్కడంతో.. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. 20 మంది సామర్థ్యం ఉన్న పడవలో 60-70 మందిని ఎక్కిస్తుంటారు. అందువల్లే లిబియాలో పడవ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. ఆగస్టులో ఇటలీ ద్వీపమైన లంపెదసాలో పడవ మునిగి 41 మంది వలసదారులు మరణించారు. జూన్‌లో 79 మంది వలసదారులు సముద్రంలో మునిగిపోయారు. ఫిబ్రవరిలో తుఫాను సమయంలో ఇటలీలోని కాలాబ్రియన్ తీరంలో వలసదారుల పడవ బండరాళ్లను ఢీకొని 96 మంది మరణించారు. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి.

- Advertisement -

2011లో నాటో మద్దతుతో జరిగిన తిరుగుబాటు తర్వాత లిబియాలో కల్లోల వాతావరణం నెలకొంది. లిబియాలో నియంత మొఅమర్ గడాఫీ హతమైనప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితిలు ఉన్నాయి. 2011లో అరబ్ స్ప్రింగ్‌లో గడాఫీ హతమయ్యాడు. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. నిత్యం యుద్ధ వాతావరణం ఉండడంతో.. అక్కడ ఉండలేక ప్రజలు అక్రమమార్గాల్లో పడవల ద్వారా మధ్యధరా మీదుగా ఐరోపా దేశాలకు వలసపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement