Thursday, April 25, 2024

అక్టోబర్‌ 29 వరకు 50 శాతం సర్వీసులే.. స్పైస్‌ జెట్‌ను ఆదేశించిన డీజీసీఏ

భద్రతా కారణాలతో స్పైస్‌జెట్‌ సంస్థ అక్టోబర్‌ 29 వరకు 50 శాతం సర్వీస్‌లను కొనసాగించాలని డీజీసీఏ ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 30 వరకు ఈ సర్వీస్‌లను నడపాల్సి ఉంది. తాజాగా మరో నెల పెంచుతూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) జులై 17న 8 వారాల పాటు 50 శాతం సర్వీస్‌లే నడపాలని స్పైస్‌ జెట్‌ను ఆదేశించింది. స్పైస్‌ జెట్‌ విమానాల్లో వరసగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. సర్వీస్‌ల సంఖ్య పెంచడం అనేది స్పైస్‌ జెట్‌ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

విమానాలను నిర్వహించేందుకు తగినంత సాంకేతిక సిబ్బంది నియామకం, ఆర్థిక వనరుల సమీకరణ వంటి ఆంశాలను సమర్ధవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కాలంలో ఎయిర్‌లైన్‌ నిఘాను కూడా పెంచాలని ఆదేశించింది. స్పైస్‌ జెట్‌ జూన్‌ త్రైమాసికంలో 789 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. 2022, మార్చి త్రైమాసికంలో 458 కోట్ల నష్టాలు వచ్చాయి. మంగళవారం నాడు సంస్థ 80 మంది పైలట్లను వేతం లేని మూడు నెలల సెలవుపై బలవంతంగా పంపించివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement