Monday, April 29, 2024

జీడీపీలో 25 శాతానికి డిజిటల్‌ ఎకనామి వాటా.. అంచనా వేసిన కేవీ కామత్‌

మన దేశం 2029 నాటికి 7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారే సమయానికి డిజిటల్‌ ఎకనామి వాటా 25 శాతం ఉంటుందని ప్రముఖ బ్యాంకర్‌, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) అధ్యక్షుడు కేవీ కామన్‌ అంచనా వేశారు. ప్రస్తుతం డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థ 4 శాతంగా ఉందన్నారు. ఇది చై నాలో ప్రస్తుతం 40 శాతంగా ఉందని చెప్పారు. 20299 నాటికి మన దేశ ఆర్ధిక వ్యవస్థ 7 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆ సమయానికి మన దేశం మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని పేర్కొంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను మన దేశం అధిగమిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

- Advertisement -

ప్రధానంగా డిజిటల్‌ ఎకనామిలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఈ-కామర్స్‌, ఇతర డిజిటల్‌ చెల్లింపులు, సర్వీసెస్‌ సిగ్మెంట్‌ వృద్ధి అధారపడి ఉందని కామత్‌ చెప్పారు. 2029 నాటికి డిజిటల్‌ ఎకనామి వాటా 25 శాతానికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. చైనాలో ప్రస్తుతం జీడీపీలో డిజిటల్‌ ఎకనామి వాటా 40 శాతంగా ఉందని, దీన్ని మనం చేరుకుంటామన్నారు. దేశంలో మరిన్ని ఎక్స్‌ప్రెస్‌ వేలు, హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, హై స్పీడ్‌ రైలు మార్గం వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఎక్కువ ఆసక్తిగా ఉన్నందున ఆర్ధిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని కామత్‌ అభిప్రాయపడ్డారు.

పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం చాలా ఉందని, దీన్ని కొన్ని పట్టణాలకే పరిమితం చేయకూడదని ఆయన చెప్పారు. మన ఆర్ధిక వ్యవస్థలో మరిన్ని ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు రావాల్సి ఉందన్నారు. ఇలాంటివి వస్తే ప్రస్తుతం ఉన్న జీడీపీ రెట్టింపు అవుతుందని ఆయన చెప్పారు. కొంత కాలంగా బ్యాంక్‌ల పనితీరు మెరుగుపడిందని, నిరర్ధక ఆస్తులు తగ్గుతున్నాయని, ఆస్తుల నిర్వహణలో నాణ్యత పెరిగిందని, ఈవన్నీ ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు సంకేతాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement