Sunday, May 5, 2024

2022 ఐపీఎల్ మెగాలీగ్.. 10 జ‌ట్లు రెండు గ్రూప్ లు.. మార్చి 26 నుంచి ఆరంభం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 15వ సీజన్‌ను స్వదేశంలోనే ముంబై, పుణేలో నాలుగు వేదికలుగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 2022..మే29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌పటేల్‌ కూడా మార్చి 26న ప్రారంభమవుతుందని ఇంతకుముందే ప్రకటించారు. ఈ ఏడాది మెగాలీగ్‌లో మరో రెండు కొత్త జట్లు ఆడనుండటంతో మొత్తం జట్లు సంఖ్య 10కి చేరింది. దీంతో మ్యాచ్‌ల సంఖ్యకు పెరిగింది. ఈసారి మొత్తం 70లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో టైటిల్‌ బరిలో దిగనున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌తోపాటు పూర్తి వివరాలను బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సెషన్‌ను కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో విమాన ప్రయాణాలు లేకుండానే నిర్వహించనున్నారు. బయోబబుల్‌ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్‌ స్టేడియాల్లో ఒక్కోదాంట్లో 20మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అదేవిధంగా ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియం, పుణలోని ఎంసిఎ అంతర్జాతీయ స్టేడియాల్లో ఒక్కోదాంట్లో 15మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వాంఖడే స్టేడియం, డీవై పాటిల్‌ స్టేడియాల్లో ఒక్కో జట్టు 4మ్యాచ్‌లు ఆడనుంది. సీసీఐ, ఎంసిఎ స్టేడియాల్లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం 10జట్లు 14లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 70లీగ్‌ మ్యాచ్‌లతోపాటు 4ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతిజట్టు 5జట్లుతో రెండుసార్లు, మిగిలిన నాలుగు జట్లు ఒకసారి మాత్రమే తలపడతాయి.

ఒక్కోగ్రూప్‌లో 5జట్లు..

ఐపీఎల్‌ 2022లో టైటిల్‌ కోసం తలపడే మొత్తం 10జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించనున్నారు. ఒక్కోగ్రూప్‌లో 5జట్లు ఉంటాయి. గ్రూప్‌-ఎ లో ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లి క్యాపిటల్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఉంటాయి. అదేవిధంగా గ్రూప్‌-బిలో చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఉంటాయి. ఒక్కో గ్రూపులో ఉండే ప్రతిజట్టు అదేగ్రూపులో ఉండే ఇతరజట్లతో రెండుసార్లు తలపడుతుంది. ఉదాహరణకు గ్రూప్‌ఎలో ఉండే ముంబై ఇండియన్స్‌ జట్టు కేకేఆర్‌, ఆర్‌ఆర్‌, ఎల్‌ఎస్‌జీ జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. అదేవిధంగా ముంబై జట్టు వేరేగ్రూప్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లు మిగిలిన జట్లుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఇదే తరహాలో గ్రూప్‌-బిలో ఉండే ఆర్‌సీబీ జట్టు సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్‌, పీబీకేఎస్‌, జీటీలతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. వేరేగ్రూప్‌లో ఆర్‌ఆర్‌తో రెండు మ్యాచ్‌లు ఇతర జట్లుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement