Monday, April 29, 2024

అమరావతి : అర్జీలకు స్పందన

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • గ్రామ సచివాలయ వ్యవస్థతోపాటు పాత పద్ధతీ ఉండాలి
  • వాలంటీర్ల రాకతో అర్జీలు నేరుగా స్వీకరించని ప్రభుత్వాధికారులు
  • ధృవీకరణ బాధ్యతలు గ్రామ సచివాలయ సిబ్బందికి
  • వివరాల సేకరణలో వారిది నిస్సహాయ స్థితి 
  • ప్రభుత్వ శాఖల నుంచి సహకారం శూన్యం
  • వివరాల్లేకుండానే దరఖాస్తులను పంపేస్తున్న సచివాలయ సిబ్బంది
  • దాంతో అర్జీలను పట్టించుకోని అధికారులు
  • మరోవంక ఆఫీసుల్లో సిబ్బందికి కొరవడిన పని
  • గ్రామ సచివాలయాలపై పని భారం 

ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో దేశంలో మరెక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ సచివాల య వ్యవస్థతో పాటు వలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. జగన్‌ అధీకారంలోకొచ్చీరావడంతోనే రెండున్నర లక్షలమంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. పెద్ద సంఖ్యలో అన్ని శాఖలకు చెందిన సిబ్బంది అందుబాటులోకి రావ డంతో ఇక పనులు చకచకా జరుగుతాయని ప్రజలాశించారు. తమ సమస్యల్ని మరిం త వేగంగా పరిష్కరించే వీలేర్పడుతుందని ఉత్సాహపడ్డారు. కానీ ఈ అదనపు సిబ్బంది, కార్యాలయాల ఏర్పాటు ప్రజలకు అదనపు ప్రయోజనాల్ని చేకూర్చకపోగా సంప్రదాయ సిద్ద ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి, అధికారులకి బద్దకాన్ని పెంచింది. వీరు పనిని తప్పించుకునే అవకాశాల్ని మెరుగుపర్చింది. గతంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన శాఖ కార్యాలయం అర్జీలు తీసుకునేది. అలాగే ప్రజల అవసరాలకు సంబంధించిన ద రఖాస్తుల్ని స్వీకరించేది. క్రిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికార్ల వరకు వాటిని పరిశీలించి అర్జీల్ని పరిష్కరించేవారు. అలాగే ప్రజలకవసరమైన సేవలందించేవారు. కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు అందుబాటులోకొచ్చాక ఏ అర్జీని ప్రభుత్వాధికార్లు నేరుగా స్వీకరించడంలేదు. వీటిని సంబంధిత గ్రామ సచివాల యాల్లో లేదా వలంటీర్లకిచ్చి మీ అవసరానికి తగిన అర్హతలు ఉన్నదీ లేందీ వార్నుంచి దృవీకరణ తెస్తే ఆ తర్వాతే సంబంధిత పనులు పూర్తి చేస్తామని పేర్కొంటున్నారు. ఒకప్పుడు రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ కార్యాలయాలు అర్జీదార్లతో కిటకిటలాడేవి. సంబంధిత అధికార్లు అర్జీల్ని స్వీకరించి అర్హతలకనుగుణంగా పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి అర్జీలన్నింటిని నేరుగా గ్రామ సచివాలయాల్లో దాఖలు చేయాలంటూ సూచిస్తున్నారు. అలాగని ఈ అర్జీల పరిష్కారానికి సంబంధించిన అధికారాలు గ్రామ సచివాలయ సిబ్బందికుండడంలేదు. ఆఖరకు కొత్తగా విద్యుత్‌ కనెక్షన్‌ కావాలన్నా గ్రామ సచివాలయంలోనే దరఖాస్తు అందించాల్సుంటుంది. సంబంధిత స్థలం యజమాని హక్కు దృవీకరణతో పాటు విద్యుత్‌ అవసరాన్ని కూడా వీరే అంచనాలేసి సంబంధిత కార్యాలయానికి పంపాల్సొస్తోంది. అలాగే వ్యవసాయ కనెక్షన్‌కు చేసుకునే దరఖాస్తుల్ని కూడా ఇప్పుడు సచివాలయ కార్యాలయాల్లోనే దాఖలు చేయాలి. ఉచిత కనెక్షన్‌ వద్దు.. వినియోగించే కరెంట్‌కు బిల్లులు చెల్లిస్తాం.. కనెక్షన్‌ ఇవ్వండి చాలంటూ మొరపెట్టుకుంటున్నా ఈ సిబ్బంది స్పందించడంలేదు. దరఖాస్తుదారుడి పొలం కొత్త కనెక్షన్‌ జారీ చేసేందుకు అనువుగా ఉందన్న విషయాన్ని ముందుగా రూఢీ చేసుకోవాలి. అలాగే ఆ పొలంపై దరఖాస్తుదారుడికి హక్కుభుక్తాలున్నాయని నిరూపించుకోవాలి. ఇంతా చేసి సంబంధిత ప్రాంతంలో భూగర్భజ లాల లభ్యతపై వివరాలు సేకరించాలి. అయితే వీటన్నింటిని సమీకరించే పరిస్థితి గ్రామ సచివాలయానికి లేదు. అందులో సిబ్బంది పూర్తిగా శాశ్వత ఉద్యోగులు కారు. తాత్కాలిక ఉద్యోగులుగానే వార్ని పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం అందడంలేదు. దరఖాస్తుల్ని రిజిష్టర్‌ చేసి సంబంధిత సమాచారాన్ని సేకరించి సంబంధిత శాఖకు పంపించాలి. అయితే సమాచారం లేకుండా సదరు శాఖలకు వీరు దరఖాస్తుల్ని పంపేస్తున్నారు. దీంతో అధికార్లు ఈ అర్జీల్ని పక్కన పడేస్తున్నారు. గతంలో ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అవసరమైన సమాచారాన్ని సేకరించేవారు. వారి కందుకనువైన వెసులుబాటుంది. ఇతర శాఖల్నుంచి వారికి సహకారం లభిస్తుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డ అనంతరం వివిధ శాఖల అధికార్లు, సిబ్బందికి పని కొరవడింది. కార్యాలయాల్లో సేదదీరేందుకే పరిమితమౌతున్నారు. ప్రభుత్వం పరిస్థితిని పున:సమీక్షించాలి. పూర్తిగా గ్రామ సచివాలయ వ్యవస్థపైనే బాధ్యతలు నెట్టడం వల్ల దరఖాస్తుదార్లు ఇబ్బందులకు గురౌతున్నారు. వారి పనులు నెరవేరడంలేదు. సమస్యలు పరిష్కారం పొందడంలేదు. గ్రామ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తూనే పాత విధానాన్ని కూడా అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో వారం వారం స్పందన పేరిట ఫిర్యాదుల స్వీకరణ చేప ట్టేవారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో తహశీల్ధార్లు, ఎమ్‌పిడిఓలు, ఆఖరకు గ్రామస్థాయిలో సంబంధిత సిబ్బంది ప్రజల్నుంచి సమస్యలపై అర్జీల్ని స్వీకరించేవారు. వీటన్నింటిని రికార్డ్‌ చేసేవారు. వాటిని పరిష్కరించి సంబంధిత వివరాల్ని తిరిగి అర్జీదార్లకు తెలియజేసేవారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్లు, ఎస్‌పిలు, వివిధ శాఖల ఉన్నతాధికార్లంతా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పరిగణించేవారు. కోవిడ్‌ కారణంగా ప్రజల్ని నేరుగా కలవలేమన్న సాకుతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసేశారు. స్పందనలో ఇచ్చే అర్జీల్ని కూడా ఇప్పుడు గ్రామ సచివాలయాల్లోనే ఇమ్మంటూ పంపిస్తున్నారు. దీంతో గ్రామ సచివాలయలపై భారం పెరగడం తప్ప అర్జీదారుడికెలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement